టీవీకే ఎమ్మెల్యేకు రూ.30 కోట్ల ఎర: మదురై మాజీ డిప్యూటీ మేయర్ అరెస్ట్

టీవీకే ఎమ్మెల్యేకు రూ.30 కోట్ల ఎర: మదురై మాజీ డిప్యూటీ మేయర్ అరెస్ట్

చెన్నై: విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు టీవీకే ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు లంచం ఎర వేశారన్న ఆరోపణలపై మదురై మాజీ డిప్యూటీ మేయర్, అన్నాడీఎంకే కార్యకర్త పి.ఎం. మన్నన్‌ అరెస్ట్ అయ్యారు. మదురై నగర సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శుక్రవారం (నవంబర్ 6) అతడిని అదుపులోకి తీసుకున్నారు. 

2026, ఏప్రిల్‎లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 234 స్థానాలకు ఎన్నికలు జరగగా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన (118 సీట్లు) మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీకి రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే వంటి పార్టీల మద్దతుతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని టీవీకే ప్రభుత్వానికి గవర్నర్ ఆదేశించారు.

బలపరీక్ష సమయంలో విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భారీగా కుట్రలు జరిగాయి. ప్రతిపక్ష డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు టీవీకే ఎమ్మెల్యేలకు పెద్ద ఎత్తున లంచం ఎర వేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగానే బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసేందుకు మదురై సెంట్రల్ టీవీకే ఎమ్మెల్యే మాధర్ బద్రుద్దీన్‎‎కు మదురై మాజీ డిప్యూటీ మేయర్, అన్నాడీఎంకే కార్యకర్త పి.ఎం. మన్నన్‌ రూ.30 కోట్లు ఆఫర్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

ఎమ్మెల్యే బద్రుద్దీన్‎‎ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎమ్.పి. దివ్య నేతృత్వంలోని ప్రత్యేక బృందం శుక్రవారం (నవంబర్ 6) మన్నన్‌ను దాదాపు 4 గంటల పాటు విచారించిన అనంతరం అరెస్ట్ చేసింది. ఈ కుట్ర వెనుక ఉన్న ఇతర పెద్దల వివరాలను సేకరించేందుకు పోలీసులు ఫోన్ రికార్డింగ్స్, ఆడియో ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.