ఇండియన్ కార్పొరేట్ వ్యాపార రంగంలో మరో సంచలనం చోటుచేసుకుంది. ప్రముఖ వీడియోకాన్ ఇండస్ట్రీస్ మాజీ ప్రమోటర్, డైరెక్టర్ వేణుగోపాల్ నంద్ లాల్ ధూత్ వ్యక్తిగతంగా దివాలా తీసినట్లు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) సంచలన తీర్పు వెలువరించింది. SBI నుంచి తీసుకున్న రూ.12వేల 668 కోట్ల అప్పులను చెల్లించడంలో విఫలం కావడంతో ముంబై బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ వివాదం 2010-2012 నాటిది. వీడియోకాన్ ఇండస్ట్రీస్, వీడియోకాన్ టెలికమ్యూనికేషన్స్ సంస్థలకు ఎస్‌బీఐ, దాని అనుబంధ బ్యాంకులు ఇచ్చిన రుణాలకు వేణుగోపాల్ ధూత్ పర్సనల్ గ్యారెంటీ ఇచ్చారు. అయితే ఆయన కంపెనీలు లోన్ రీపేమెంట్స్ చెల్లించకపోవడంతో 2018 జూన్‌లో అవి కార్పొరేట్ దివాలా ప్రక్రియలోకి వెళ్లాయి. అప్పట్నుంచీ బ్యాంకులు ఆయనపై ఒత్తిడి తెచ్చినా ఫలితం లేకపోవడంతో.. ఎస్‌బీఐ లీగల్ పోరాటాన్ని తీవ్రం చేసింది.
లోన్స్ చెల్లింపు కోసం ధూత్ రూ.600 కోట్లతో ఓ రీపేమెంట్ ప్లాన్‌ను ముందుకు తెచ్చినప్పటికీ.. రుణదాతలు దాన్ని తిరస్కరించారు. భవిష్యత్ ప్రాజెక్టులపై ఆధారపడిన ఆ ప్రతిపాదన కేవలం అసలు బకాయిల్లో 0.42% మాత్రమేనని, పైగా ఎలాంటి ముందస్తు చెల్లింపులు లేవని బ్యాంకులు తేల్చిచెప్పాయి. దీంతో ఆయన ప్లాన్‌ను ఎన్‌సీఎల్‌ఐ పూర్తిగా తోసిపుచ్చింది.
ఈ పరిస్థితుల్లో ధూత్ ఆస్తులన్నింటినీ కంట్రోల్ చేసే బాధ్యతను దివాలా ట్రస్టీ ఆశిష్ నారాయణ్‌కు అప్పగించారు తాజా ఉత్తర్వుల్లో. ఆయన తన ఆర్థిక స్థితిగతుల పూర్తి వివరాలను ట్రస్టీకి సమర్పించాలని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ఒకప్పుడు మార్కెట్ దిగ్గజంగా వెలుగు వెలిగిన వేణుగోపాల్ ధూత్ దివాలా తీయడం కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
