పంజాబ్‎లో రన్నింగ్ ట్రైన్‎లో చెలరేగిన మంటలు.. పట్టాలపై తగలబడ్డ ఐదు బోగీలు..!

పంజాబ్‎లో రన్నింగ్ ట్రైన్‎లో చెలరేగిన మంటలు.. పట్టాలపై తగలబడ్డ ఐదు బోగీలు..!

చంఢీఘర్: పంజాబ్‌లోని పాటియాలా సమీపంలో రన్నింగ్ ట్రైన్‎లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అమృత్‌సర్-న్యూ జల్పైగురి కర్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు క్షణాల్లోనే ఒక బోగీ నుంచి మరో బోగీకి వ్యాపించాయి. మొత్తం ఐదు బోగీలు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. ట్రైన్ అమృత్‎సర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రన్నింగ్ ట్రైన్‎లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

మంటలను గమనించిన లోకో పైలట్ వెంటనే రైలును నిలిపివేశాడు. ప్రయాణికులు వెంటనే రైలు నుంచి కిందకు దిగారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. ఘటన స్థలంలో సహయక చర్యలు కొనసాగుతున్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించిన ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. 

పట్టాలపై బోగీలు తగలబడిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లను అధికారులు దారి మళ్లించారు. రైల్వే అధికారుల ప్రకారం.. రైలు ఇంజన్ నుంచి ఐదవ కోచ్ నంబర్ కోచ్‌లో అగ్నిప్రమాదం జరిగింది.