రాజ్యాంగం కంటే రాజకీయ పార్టీ గొప్ప కాదు : సుప్రీంకోర్టు

రాజ్యాంగం కంటే రాజకీయ పార్టీ గొప్ప కాదు : సుప్రీంకోర్టు

రాజ్యాంగం పై భారత్ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.రాజ్యాంగం కంటే ఏ ఒక్క రాజకీయ పార్టీ గొప్పది కాదని స్పష్టం చేశారు. సీజేఐని టార్గెట్ చేస్తూ X లో పోస్ట్ చేసిన వ్యవహారంలో స్పందించిన విచారణ చేపట్టిన జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం పంచోలి బెంచ్.. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ ) అధ్యక్షుడు సహా పలువురు నేతలకు నవంబర్ 6న నోటీసులు జారీ చేశారు.

న్యాయవాది వినీత్ జిందాల్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు..కేపీసీసీ అధ్యక్షుడు, కార్యదర్శితో సహా కమిటీ అధికారులందరూ తమపై కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోవద్దో వివరించాలని ఆదేశించింది.

అక్టోబర్ 12, 2026న కేపీసీసీ అధికారిక X అకౌంట్ నుంచి "Dear Surya Kant, If law and order is not your domain, resign now. We will find your replacement who can handle it" అని పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ తర్వాత డిలీట్ చేశారు.

ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగమే సర్వోన్నతమైనదని, ఏ వ్యక్తీ, ఏ రాజకీయ పార్టీ దానికంటే పైన నిలవలేరని చేసింది. న్యాయపాలన స్వాతంత్ర్యం రాజకీయ అనుకూలత బట్టి మారే విషయం కాదని కోర్టు స్పష్టం చేసింది.

న్యాయ నిర్ణయాలపై విమర్శ చేయవచ్చునని , అయితే న్యాయవ్యవస్థను భయపెట్టేందుకు లేదా న్యాయపాలనకు అడ్డుపడేందుకు భావప్రకటనా స్వేచ్ఛను ఆసరాగా వాడుకోలేరని కోర్టు తెలిపింది.

ALSO READ : తరుణ్ తేజ్ పాల్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు..

కేపీసీసీ తరఫు న్యాయవాది వాదిస్తూ, ఆ పోస్ట్ ను పార్టీ నేతల అనుమతి లేకుండా ఓ కార్యకర్త చేశారని, విషయం తెలిసిన వెంటనే తొలగించారని చెప్పారు. పార్టీ అప్పటికే షరతులు లేని క్షమాపణ చెప్పిందని, కోర్టుకు కూడా క్షమాపణ దాఖలు చేస్తామని చెప్పారు. దానిపై స్పందించిన జస్టిస్ అరవింద్ కుమార్, క్షమాపణ నిజంగా హృదయపూర్వకంగా వచ్చిందా లేదా కేవలం కాగితానికే పరిమితమైందా అని పరిశీలిస్తామని అన్నారు.

కోర్టు ఈ దశలో నేతలను నేరుగా హాజరు కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అటార్నీ జనరల్‌ను, సీనియర్ న్యాయవాదులు అరవింద్ దాతర్, సిద్ధార్థ్ అగర్వాల్‌లను అమికస్ క్యూరీగా నియమించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు బెంచ్ తెలిపింది.