TTD Update: సాధికారిక మండలి చైర్మన్‌గా ఈవో రవిచంద్ర ప్రమాణం

TTD Update:  సాధికారిక మండలి  చైర్మన్‌గా ఈవో రవిచంద్ర ప్రమాణం

 టీటీడీ స్పెసిఫైడ్‌ అథారిటీ చైర్మన్‌గా ఈవో ముద్దాడ రవిచంద్ర శుక్రవారం  (2026 నవంబర్​ 6) ఉదయం బాధ్యతలు స్వీకరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బీఆర్‌ నాయుడు చైర్మన్‌గా టీటీడీ బోర్డును ఏర్పాటు చేయగా ఆ బోర్డు పదవి కాలం గత నెల 31( 2026 అక్టోబర్​) వ తేదీన పూర్తయింది. ఈ నేపథ్యంలో ఏపీ  ప్రభుత్వం స్పెసిఫైడ్‌ అథారిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి టీటీడీ ఈవోను చైర్మన్‌గా, ఆర్థిక శాఖ కార్యదర్శి వినయ్‌చంద్‌, రెవెన్యూ శాఖ (దేవదాయ) కార్యదర్శి కన్నబాబును సభ్యులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.

టీటీడీ సాధికారిక మండలి ఛైర్మన్‌గా టీటీడీ ఈవో  ముద్దాడ రవిచంద్ర శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి దగ్గర  జరిగిన కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో  సి.హెచ్. వెంకయ్య చౌదరి ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఛైర్మన్‌కు వేదాశీర్వచనం అందించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్భంగా  ముద్దాడ రవిచంద్ర శ్రీవారి ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ, దేవుని సేవ చేసేందుకు ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రస్తుతం టీటీడీ చేపడుతున్న సేవా కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా, మెరుగైన రీతిలో కొనసాగించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తమ మనసును పూర్తిగా స్వామివారిపై లగ్నం చేసేలా అవసరమైన అన్ని ఏర్పాట్లను టీటీడీ కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. భక్తులకు అన్ని విధాలా మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు.

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ నిర్వహిస్తున్న ఇతర 64 ఆలయాల్లోనూ భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు.టీటీడీ నిర్వహిస్తున్న విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, వారిని సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా, సేవాభావం కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడంపై దృష్టి సారిస్తామని తెలిపారు.

 టీటీడీ ఆధ్వర్యంలోని వైద్యశాలలకు వచ్చే రోగులకు ఆధునిక వైద్య సదుపాయాలతో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. భక్తులకు సౌకర్యాలు, ఆధ్యాత్మిక సేవలతో పాటు విద్య, వైద్య రంగాల్లోనూ మరింత విస్తృతంగా సేవలందించడమే తమ సంకల్పమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జేఈవో (ఆరోగ్యం&విద్య)  ప్రభల గోపీనాథ్, సీవీఎస్వో  మురళీకృష్ణ, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో  భాస్కర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.