ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివాహితతో ప్రేమాయణం సాగిస్తున్న ఓ యువకుడు ఆమెను కలిసేందుకు ఇంటికి వెళ్లగా.. కొద్ది గంటల వ్యవధిలోనే అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. గదిలో ఉరికి వేలాడుతూ కనిపించడంతో ఈ ఘటన పలు అనుమానాలకు తావిస్తోంది.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన శివ ప్రతాప్ సింగ్ అనే యువకుడికి ఫేస్‌బుక్లో ఓ వివాహితతో పరిచయం ఏర్పడింది. ఏడాది కాలంగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఆమెను కలిసేందుకు శివ ప్రతాప్ ఆమె ఇంటికి వెళ్లాడు.
వీరిద్దరూ కలిసి ఉండటాన్ని గుర్తించిన ఆమె బావమరిది శివ ప్రతాప్ను ఒక గదిలో పెట్టి లాక్ చేశాడు. శివ ప్రతాప్ అదే గదిలో ఉరికి వేలాడుతూ కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు షాక్‌కు గురయ్యారు. మరోవైపు, శివ ప్రతాప్ మృతిపై అతడి కుటుంబ సభ్యులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అతడిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు.
►ALSO READ | భార్యతో సహా.. అత్త, బామ్మర్దులు, వాళ్ల భార్యలు.. ఇలా ఏడుగురిని చంపేసిన భర్త !
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహిళతో పాటు ఆమె కుటుంబానికి చెందిన మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. అసలు శివ ప్రతాప్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేక అతడిని ఎవరైనా హత్య చేసి ఉరేసుకున్నట్లు చిత్రీకరించారా? అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
శివ్ ప్రతాప్ సింగ్ ఉన్నావ్‌లోని జిల్లా సహకార బ్యాంకు ఛైర్మన్, బీజేపీ నాయకుడైన అరుణ్ సింగ్ దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి సుమారు ఏడాది క్రితం ఫేస్‌బుక్‌లో ఆ మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమాయణం సాగించారు. ఆ మహిళ భర్త రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కాగా, ఆమె తండ్రి పోలీస్ సబ్- ఇన్‌స్పెక్టర్.
