మానవత్వాన్ని ప్రశ్నార్థకంగా మార్చే హృదయవిదారక ఘటన చెన్నైలోని నీలంకరై ప్రాంతంలో వెలుగుచూసింది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును, బొడ్డు తాడు కూడా తెగని స్థితిలో రోడ్డు పక్కన వదిలివెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బుధవారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నీలంకరైలోని కపాలీశ్వరర్ నగర్, నాలుగో మెయిన్ రోడ్డులో ఉదయం స్థానికులు అటుగా వెళ్తుండగా ఓ చిన్నారి ఏడుపు వినిపించింది.
దీంతో వారు పరిసరాల్లో వెతకగా, రోడ్డు పక్కన నిర్లక్ష్యంగా పడేసిన స్థితిలో నవజాత ఆడ శిశువు కనిపించింది. అప్పటికీ శిశువుకు బొడ్డు తాడు ఉండటంతో ఆమె కొన్ని గంటల క్రితమే పుట్టిందని స్పష్టంగా అర్థమైంది. ఈ దృశ్యం చూసిన స్థానికులు చలించిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
నీలంకరై పోలీసులు స్పాట్‌కు చేరుకుని చిన్నారిని కాపాడారు. ప్రాథమిక చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స, వైద్య పర్యవేక్షణ కోసం చెన్నైలోని ఎగ్మోర్ ప్రభుత్వ చిన్నపిల్లల ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చిన్నారిని ఎవరు వదిలివెళ్లారనే విషయాన్ని తెలుసుకునేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు.
ఈ క్రమంలో ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ తల్లీ, కూతురుగా గుర్తించినట్లు సమాచారం. ఈ దారుణానికి ఒడిగట్టిన పసికందు కన్న తల్లి ఒక మాజీ ఎయిర్ హోస్టెస్ అని, గర్భం కారణంగా కొన్ని నెలల క్రితం తన ఎయిర్‌లైన్ ఉద్యోగం మానేసిందని తెలిసింది. ఆడ బిడ్డ పుట్టిందనే కారణంగా ఇంతటి ఘాతుకాని ఒడిగట్టారేమోననే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
