కీరవాణి ఇంట పెళ్లి సందడి.. కాలభైరవ, కావ్య నిశ్చితార్థ వేడుక.. వియత్నాంలో బ్యాచిలర్ పార్టీ!

కీరవాణి ఇంట పెళ్లి సందడి.. కాలభైరవ, కావ్య నిశ్చితార్థ వేడుక.. వియత్నాంలో బ్యాచిలర్ పార్టీ!

టాలీవుడ్‌లో మరో సెలబ్రిటీ పెళ్లికి రంగం సిద్ధమవుతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి పెద్ద కుమారుడు, సింగర్, మ్యూజిక్ కంపోజర్ కాలభైరవ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. హీరోయిన్ కావ్య కల్యాణ్ రామ్‌తో ఆయన ఏడడుగులు వేయబోతున్నాడు. ఇప్పటికే వీరిద్దరి ప్రేమ వ్యవహారాన్ని అధికారికంగా ప్రకటించగా.. ఇప్పుడు పెళ్లి పనులు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. దీంతో కీరవాణి కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది.

కాలభైరవ, కావ్య కల్యాణ్ రామ్‌లకు 'ఉస్తాద్' సినిమా సమయంలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇరు కుటుంబాల పెద్దలను పెళ్లికి ఒప్పించి అధికారిక ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్టు 31న సోషల్ మీడియా వేదికగా తమ ప్రేమ విషయాన్ని వెల్లడించి ఫ్యాన్స్ కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇప్పటికే కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి నిశ్చితార్థం కూడా జరిగినట్లు తెలుస్తోంది. లేటెస్ట్ గా ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

మరోవైపు డిసెంబర్‌లో వివాహం జరగనున్న నేపథ్యంలో వధువు ఇంట్లో పెళ్లి వేడుకలకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రత్యేక సందర్భంలో కీరవాణి కుటుంబ సభ్యులతో పాటు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, ఆయన భార్య రమ కూడా పాల్గొని కాబోయే దంపతులను ఆశీర్వదించినట్లు సమచారం. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను కావ్య తండ్రి సోషల్ మీడియాలో పంచుకోవడంతో అవి వైరల్ అవుతున్నాయి.

ఇక పెళ్లికి ముందు కావ్య తన స్నేహితురాళ్లతో కలిసి వియత్నాంలో అదిరిపోయే బ్యాచిలర్ పార్టీని సెలబ్రేట్ చేసుకుంది. అక్కడి అందమైన లొకేషన్లలో ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేస్తూ దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెకు ముందస్తు పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మొత్తానికి సంగీత ప్రపంచానికి చెందిన కుటుంబంలోకి టాలీవుడ్ హీరోయిన్ అడుగుపెట్టబోతుండటంతో ఈ పెళ్లిపై సినీ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది..