మల్టీఫ్లెక్సుల్లో ఈ కక్కుర్తి ఏంట్రా : వాడి పడేసిన కప్పుల్లో కూల్ డ్రింక్స్ పోసి ఇస్తున్నారు.. PVR ఐనాక్స్లో బాగోతం

మల్టీఫ్లెక్సుల్లో ఈ కక్కుర్తి ఏంట్రా : వాడి పడేసిన కప్పుల్లో కూల్ డ్రింక్స్ పోసి ఇస్తున్నారు.. PVR ఐనాక్స్లో బాగోతం

సినిమా చూడటానికి థియేటర్‌కు వెళ్లి ఇష్టమైన కూల్‌డ్రింక్ లేదా జ్యూస్ తాగుతున్నారా? అయితే ఈ వార్త తెలిస్తే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎందుకంటే.. ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ PVR INOXలో వాడేసిన డిస్పోజబుల్ కప్పులనే మళ్లీ వినియోగిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు. ఏకంగా బెంగళూరులోని PVR జ్యూస్ కౌంటర్‌నే మూసివేశారు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? ఎలా బయటపడింది? అనే వివరాలు తెలుసుకుందాం.. 

వైరల్ వీడియోతో వెలుగులోకి వచ్చిన PVR ఐనాక్స్ బాగోతం

బెంగళూరులోని కొణనకుంట క్రాస్ ప్రాంతంలో ఉన్న ఫోరం మాల్ PVR INOX మల్టీప్లెక్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. నవంబర్ 5న మిథిల్ కుమార్ అనే ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుడు ఓ వీడియోను షేర్ చేశారు. అక్కడ కనిపిస్తున్న కప్పులను చూపిస్తూ మిథుల్ మాట్లాడుతూ..‘అందులో ఉపయోగించినట్టుగా కనిపిస్తున్న డిస్పోజబుల్ కప్పులు ఒకచోట గుట్టగా ఉండటం కనిపించింది. థియేటర్ సిబ్బంది ఇప్పటికే వినియోగించిన కప్పులను మళ్లీ కస్టమర్లకు పానీయాలు అందించేందుకు ఉపయోగిస్తున్నారంటూ’ ఆయన ఆరోపించారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mithil Kumar (@mithil_mits)

ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో PVR INOX నిర్వహణ తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ ధరలు చెల్లించి థియేటర్లలో ఆహార పదార్థాలు కొనుగోలు చేస్తున్న కస్టమర్లకు కనీస పరిశుభ్రత కూడా పాటించరా? అంటూ ప్రశ్నించారు. మరికొందరు మల్టీఫ్లెక్సుల్లో ఈ కక్కుర్తి ఏంట్రా అని ఫైర్ అవుతున్నారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు.

తనిఖీల్లో బయటపడ్డ ఉల్లంఘనలు.. జ్యూస్ కౌంటర్ క్లోజ్!

ఈ ఫిర్యాదుపై కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యూటీ ఖాదర్ స్పందించారు. ఫోరం మాల్‌లోని PVR INOX అవుట్‌లెట్‌లో ఆహార భద్రత అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు నవంబర్ 5న ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. ఈ తనిఖీల్లో ఆహార భద్రత నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినట్లు తెలిపారు. దీంతో సంబంధిత సంస్థకు అధికారులు నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా అక్కడి జ్యూస్ కౌంటర్‌ను మూసివేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. ఆహార భద్రత విషయంలో పెద్ద సంస్థలు, చిన్న వ్యాపారులు అనే తేడా ఉండదని.. ప్రతి ఒక్కరూ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు.

స్పందించిన ఫోరం మాల్.. విచారణ చేపట్టిన PVR

ఈ ఘటనపై ఫోరం సౌత్ బెంగళూరు మాల్ యాజమాన్యం స్పందించింది. వైరల్ వీడియో కింద కామెంట్ చేస్తూ వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలిపింది. PVR బృందం ఇప్పటికే ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిందని, తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. అయితే ఈ వార్త ప్రచురితమయ్యే సమయానికి PVR INOX సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఫిర్యాదుల కోసం ప్రత్యేక QR కోడ్..

మరోవైపు, ఎక్కడైనా అపరిశుభ్రమైన ఆహారం, ప్యాకేజింగ్ లేదా సర్వింగ్ విధానాలు కనిపిస్తే ప్రజలు ఫిర్యాదు చేయాలని మంత్రి యూటీ ఖాదర్ కోరారు. ఇందుకోసం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ఫుడ్ సేఫ్టీ QR కోడ్‌ను స్కాన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ప్రతి ఫిర్యాదును పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. మొత్తానికి, ఓ కస్టమర్ చేసిన ఫిర్యాదు.. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోతో పెద్ద చర్చకు దారితీసింది. చివరకు ప్రభుత్వ అధికారులు రంగంలోకి దిగి చర్యలు తీసుకోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. థియేటర్లలో ఆహార పదార్థాలు విక్రయించే సంస్థలు వినియోగదారుల ఆరోగ్యం, పరిశుభ్రత విషయంలో ఎంత బాధ్యతగా వ్యవహరించాలనే అంశాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.