వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా వృద్దాప్యంలో ఈ మార్పులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. జ్ఞాపకశక్తి తగ్గడం, మతిమరుపు, డైమెన్షియా, నాడీ సంబంధిత సమస్యలు, జీర్ణక్రియలో ఇబ్బందులు, జీవక్రియ మందగించడం వంటి సమస్యలు వృద్ధులను వేధిస్తుంటాయి. అయితే ఈ సమస్యలను ముందుగానే గుర్తించి, ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని ప్రోత్సహించే మార్గాలను కనుగొనే దిశగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కీలక పరిశోధనకు శ్రీకారం చుట్టింది.
లక్నో విశ్వవిద్యాలయం నేతృత్వంలోని పరిశోధన బృందానికి ఐసీఎంఆర్ అన్వేషణ్ కార్యక్రమం కింద రూ.2 కోట్ల గ్రాంటు మంజూరు చేసింది. ఈ పరిశోధనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ప్రేగులు -మెదడు మధ్య సంబంధంపై అధ్యయనం చేయనున్నారు. ముఖ్యంగా న్యూరోపెప్టైడ్స్ అనే జీవసంబంధ సంకేతాల ద్వారా వృద్ధాప్యంలో మెదడు, జీర్ణవ్యవస్థ పనితీరులో వచ్చే మార్పులను గుర్తించనున్నారు.
ఈ పరిశోధన విజయవంతమైతే వృద్దాప్యంలో వచ్చే డైమెన్షియా, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి సమస్యల ప్రారంభ జీవసంబంధ గుర్తులను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది. అలాగే ప్రేగుల ఆరోగ్యాన్ని లక్ష్యంగా చేసుకుని కొత్త నివారణ, చికిత్సా విధానాల అభివృద్ధికి మార్గం దొరుకుతుంది. దీంతో వృద్ధాప్యంలో వ్యాధుల ముప్పును తగ్గించి, మెరుగైన జీవన ప్రమాణాలను అందించేందుకు ఈ పరిశోధన దోహదపడే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
