సర్ సిల్క్ మిల్ భూముల వివాదం.. సిర్పూర్ ఎమ్మెల్యే తో సహా 3 వేల మందికినోటీసులు

సర్ సిల్క్ మిల్ భూముల వివాదం.. సిర్పూర్  ఎమ్మెల్యే తో సహా 3 వేల మందికినోటీసులు

కాగజ్‌నగర్: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని మూతపడిన సర్ సిల్క్ మిల్ భూముల్లో నివాసం ఉంటున్న సుమారు 3 వేల మందికి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ నోటీసులు అందజేశారు. 

సర్ సిల్క్ మిల్ పరిశ్రమ మూతపడిన అనంతరం ఆ భూముల్లో స్థానికులు నివాస గృహాలు నిర్మించుకుని ఏళ్లుగా జీవిస్తున్నారు. దశాబ్దాలుగా అక్కడ నివాసం ఉంటున్న కుటుంబాలకు తాజాగా భూములు ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు జారీ చేయడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.

నోటీసులు అందుకున్న ఏడు రోజుల్లోపు సంబంధిత భూములను ఖాళీ చేసి అప్పగించాలని రెవెన్యూ అధికారులు ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నివాసితుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుత సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబుకు సైతం భూములు ఖాళీ చేయాలని నోటీసులు అందించారు.  అయితే, సర్ సిల్క్ భూముల్లో నివాసం ఉంటున్న ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు భరోసా ఇచ్చారు. ప్రజలకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు.

దశాబ్దాలుగా నివాసం ఉంటున్న సుమారు 3 వేల మందికి సంబంధించిన ఈ భూముల వ్యవహారం ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. అధికారులు తీసుకోబోయే తదుపరి చర్యలు, ప్రజలకు లభించే న్యాయపరమైన ఊరటపై ఉత్కంఠ నెలకొంది.