భద్రాద్రి కొత్తగూడెం: ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లపై TG SAFE అధికారులు కొరడా ఝుళిపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ వింగ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో కూడిన నాలుగు ప్రత్యేక బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయి. తనిఖీల్లో పలు హోటళ్లలో అపరిశుభ్ర వాతావరణం, ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు బయటపడినట్లు అధికారులు గుర్తించారు.
హోటళ్ల వంట గదుల్లో అధికారులు తనిఖీలు నిర్వహించగా అనేక లోపాలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని హోటళ్లలో కిచెన్లు అపరిశుభ్రంగా ఉండటంతో పాటు బొద్దింకలు, ఇతర కీటకాలు కనిపించినట్లు గుర్తించారు. ఆహార పదార్థాలను నిల్వ చేసేందుకు సరైన స్టోరేజ్ రూమ్లు కూడా లేని హోటళ్లు ఉన్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. ఆహార పదార్థాల తయారీ, నిల్వ విషయంలో కనీస జాగ్రత్తలు పాటించకపోవడంపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
కొన్ని హోటళ్లలో తయారీ తేదీలు, ఇతర వివరాలు లేని ఆహార పదార్థాలను గుర్తించారు. అలాగే పెస్ట్ కంట్రోల్ నిర్వహణకు సంబంధించిన రికార్డులు, హోటల్ సిబ్బంది ఆరోగ్యానికి సంబంధించిన రికార్డులు కూడా సక్రమంగా నిర్వహించని నిర్వాహకులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆహార భద్రతా ప్రమాణాలను పాటించకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న హోటళ్లపై చర్యలు తీసుకున్నారు.తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన కొన్ని హోటళ్లు, టిఫిన్ సెంటర్లను అధికారులు మూసివేశారు. మరికొన్ని హోటళ్ల నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇంకొన్ని చోట్ల గుర్తించిన లోపాలను సరిదిద్దుకోవాలని సూచిస్తూ ఇంప్రూవ్మెంట్ నోటీసులు అందించారు.
