అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇండియన్ ఉద్యోగులను డిస్సపాయింట్ చేసింది. రికార్డు స్థాయి లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ.. భారతదేశంలోని తన ఉద్యోగులకు ఈ అప్రైజల్ సైకిల్లో కేవలం నామమాత్రపు జీతాల పెంపును ప్రకటించింది. ఏకంగా 91 శాతం మంది మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు కేవలం 5 శాతం లేదా అంతకంటే తక్కువ మాత్రమే జీతం పెరిగిందని ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫాం 'బ్లైండ్' నిర్వహించిన సర్వేలో తేలింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి తక్కువ ఇంక్రిమెంట్లు అందుకున్న వారి సంఖ్య భారీగా ఉండటంతో ఉద్యోగుల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
కంపెనీ ఆర్థికంగా అద్భుతమైన వృద్ధిని సాధిస్తున్న సమయంలో ఇలా తక్కువ పే హైక్స్ ఇవ్వటం పెద్ద చర్చకు దారితీసింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో మైక్రోసాఫ్ట్ నికర ఆదాయం 32 శాతం పెరిగి 36.6 బిలియన్ డార్లకు చేరుకోగా.. క్లౌడ్, ఏఐ రంగాల్లో పెట్టుబడులు జోరుగా సాగుతున్నాయి. అయితే కంపెనీ ఆర్థిక లాభాలకు, ఉద్యోగుల ఇంక్రిమెంట్‌కు పొంతన కుదరకపోవడంతో 86 శాతం మంది ఉద్యోగులు తమ జీతాల పెంపు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు కంపెనీ తీసుకొచ్చిన బైఔట్ స్కీమ్ ఉద్యోగుల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది.
ALSO READ : వీడియోకాన్ అధినేత వేణుగోపాల్ ధూత్ దివాలా..
ఈ పరిణామాలపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కోట్లకు కోట్లు లాభాలు సంపాదిస్తున్నా ఉద్యోగులకు మొండిచేయి చూపుతున్నారంటూ మండిపడుతున్నారు. మరికొందరైతే ఇండియన్ ఉద్యోగులు రియాలిటీని అర్థం చేసుకోవాలని ఏఐ కారణంగా వేల మందిని ఒకపక్క కంపెనీలు తొలగిస్తుంటే జీతాల పెంపుపై ఏడవటం ఏందని హితవు పలుకుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులతో చాలా మంది ఉన్న ఉద్యోగం పీకేయకుండా ఉంటే చాలు దేవుడా అని రోజూ బిక్కుబిక్కుమంటూ గడుపుతుంటే.. ఇండియాలో ఉద్యోగులు హైక్స్ గురించి పెదవి విరవటం సరికాదని చురకలు అంటిస్తున్నారు నెటిజన్లు. మెుత్తానికి మైక్రోసాఫ్ట్‌లో తక్కువ జీతాల పెంపు, జాబ్ సెక్యూరిటీపై నెలకొన్న అనిశ్చితి టెక్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
