న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా పేర్లు తొలగించబడిన ఓటర్లకు ఓటర్ తుది జాబితాలో చేరేందుకు మరో అవకాశం కల్పించింది. అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, నాగాలాండ్ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీ ఓటర్లకు ఈ ఛాన్స్ కల్పించింది. ఈ మేరకు శుక్రవారం (నవంబర్ 6) ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఓటర్ల జాబితా సవరణ సమయంలో గైర్హాజరైన, ఇళ్లు మారడం, మరణించిన, నకిలీ ఓటర్లుగా గుర్తించబడటం, ఎన్యుమరేషన్ ఫారాలు అందకపోవడం వల్ల డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా నుంచి తొలగించబడిన వారికి ఈ అవకాశం వర్తిస్తుంది. బూత్ స్థాయి అధికారులు నేరుగా ఓటర్ల ఇళ్లకు వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను అందజేయాలని ఈసీ ఆదేశించింది.
రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేసింది. ముసాయిదా తుది జాబితాలో ఓటు కోల్పోయిన వారు సర్ ప్రక్రియలో తమ దరఖాస్తులు ఎందుకు తిరస్కరణకు గురయ్యాయో ఒక వివరణ జతచేసి సంబంధిత పోలింగ్ అధికారికి స్వయంగా లేదా కుటుంబ సభ్యుల ద్వారా అందించాల్సి ఉంటుంది. అలాగే, ఓటు పునరుద్ధరణ కోసం ఇప్పటికే ఫారం-6 సమర్పించిన వారు మళ్లీ కొత్తగా ఎన్యుమరేషన్ ఫారం ఇవ్వాల్సిన అవసరం లేదని.. వారి దరఖాస్తులను నిబంధనల ప్రకారం అధికారులు పరిశీలిస్తారని పేర్కొంది.
