కరువు పూట రైతు భరోసా!..సాగు చేయకున్నా రైతులకు సాయం

కరువు పూట రైతు భరోసా!..సాగు చేయకున్నా రైతులకు సాయం
  • సీఎం సూత్రప్రాయ నిర్ణయం.. మంత్రుల అభిప్రాయ సేకరణ
  • నిధులు రెడీ చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశం
  • ఎల్‌‌నినోతో యాసంగి సాగు భారీగా తగ్గే చాన్స్

హైదరాబాద్, వెలుగు: కరువు పూట అన్నదాతలను ఆదుకునేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఈ యాసంగిలో పంటలు సాగు చేసినా, చేయకున్నా రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని భావిస్తోంది. ఇటీవలి కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై మంత్రుల అభిప్రాయం కూడా తీసుకున్నట్లు తెలిసింది. ఎల్‌‌నినో ప్రభావంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారుతున్నా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా రైతులను ఆదుకోవాలని నిర్ణయించిన సీఎం, యాసంగి రైతు భరోసాకు అవసరమైన నిధులు సిద్ధం చేసుకోవాలని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

నిధుల కొరతతో రైతులకు ఎక్కడా ఇబ్బంది రాకూడదని, వ్యవసాయ, ఆర్థిక శాఖలు సమన్వయంతో సకాలంలో లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేసేలా కసరత్తు ప్రారంభించాలని సీఎం సూచించినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. సరైన సమయంలో పెట్టుబడి సాయంగా గానీ, కరువు కాలంలో ఇన్‌‌పుట్ సబ్సిడీ కింద గానీ రైతు భరోసా నిధులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

25 లక్షల ఎకరాలు కూడా కష్టమే..

ఈ యాసంగిలో సాగు విస్తీర్ణం భారీగా తగ్గే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు అడుగంటడంతో ఆయకట్టుకు సాగునీరు ఇచ్చే పరిస్థితి ఏమాత్రం లేదని ఇరిగేషన్ శాఖ అధికారులు తేల్చిచెప్పారు. భూగర్భ జలాలు కూడా అడుగంటడంతో చాలా మంది రైతులు పంటలు వేసేందుకు వెనుకడుగు వేస్తున్నారని, రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల్లో కూడా పంటలు సాగయ్యే అవకాశం లేదని అంచనా వేశారు. ఇప్పటివరకు సాగయ్యే భూములకే ప్రభుత్వం రైతు భరోసా ఇస్తోంది. కానీ ఈసారి సాగు తగ్గినా కరువు పూట రైతులకు పూర్తిస్థాయిలో రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. గత వానాకాలం సీజన్‌‌లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.48 కోట్ల ఎకరాలకు, 70.40 లక్షల మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.8,759 కోట్ల రైతు భరోసా జమ చేసింది.