- రాంలీలా ర్యాలీ సక్సెస్‌తో కాంగ్రెస్ లో జోష్
- సీఈసీ, సర్‌కు వ్యతిరేకంగా నిరసనలు
- రాష్ట్రాల వారీగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి
- సీడబ్ల్యూసీ సభ్యులు, సీనియర్ నేతల హాజరు
న్యూఢిల్లీ, వెలుగు: ‘ఓట్ చోరీ’పై మరో దేశవ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. నవంబర్ 1న రాంలీలా మైదానంలో ఇండియా కూటమి నిర్వహించిన ర్యాలీ సక్సెస్ కావడంతో, అదే ఊపుతో దేశవ్యాప్తంగా మరో ఆందోళన చేపట్టి, ఆ తర్వాత రాష్ట్రాల వారీగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తోంది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)కు వ్యతిరేకంగా చేపట్టాల్సిన నిరసనల వ్యూహంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్టీ నేతలతో చర్చించారు. శుక్రవారం ఢిల్లీ సునేరీ బాగ్‌లోని తన అధికారిక నివాసంలో నిర్వహించిన ‘దీపావళి మిలన్’ కార్యక్రమంలో ఆయన నేతలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.
ఓటర్ల జాబితా సవరణ, ఎన్నికల పారదర్శకత, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే సంస్థల జవాబుదారీతనం వంటి అంశాలపై ప్రజల దృష్టిని ఆకర్షించాలని నిర్ణయించినట్లు నేతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, జైరాం రమేశ్, సచిన్ పైలట్, కుమారి సెల్జా, హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు, కర్నాటక నుంచి డీకే శివకుమార్, మాజీ సీఎంలు భూపీందర్ సింగ్ హుడా, భూపేశ్ బఘేల్, అశోక్ గెహ్లాట్, హరీశ్ రావత్, సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌తో పాటు సీడబ్ల్యూసీ సభ్యులు, రాష్ట్ర ఇన్‌చార్జిలు, ఎంపీలు హాజరయ్యారు.
