నువ్వేం ఫ్రెండువిరా నాయనా..! కష్టాల్లో ఉన్నా ఫ్రెండ్ అని అడిగితే.. కన్నం వేయాలని సలహా

నువ్వేం ఫ్రెండువిరా నాయనా..! కష్టాల్లో ఉన్నా ఫ్రెండ్ అని అడిగితే.. కన్నం వేయాలని సలహా
  • తన పిన్ని ఇంట్లో చాలా బంగారం ఉందని   తాళాలు ఇచ్చింది
  • డూప్లికేట్ కీ తో తెరిచి బంగారం, వెండి చోరీ 
  • పట్టుకున్న పోలీసులు  
  • దాదాపు అరకిలో బంగారం, 2.9 కిలోల వెండి స్వాధీనం

మల్కాజిగిరి, వెలుగు : ‘అరేయ్​..నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా..ఎలాగైనా నువ్వే హెల్ప్​చేయాలి రా ’ అని ఓ వ్యక్తి తన స్నేహితురాలి హెల్ప్​అడిగాడు. దీనికి చలించిపోయిన ఆమె తన పిన్ని దగ్గర చాలా బంగారం ఉందని చెప్పి, ఆ ఇంటి మరో తాళం చెవి తీసుకువచ్చి ఇచ్చింది. ఏమాత్రం ఆలస్యం చేయని ఆ ఫ్రెండ్​ డూప్లికేట్​ కీ తయారు చేసుకుని ఎవరూ లేనప్పుడు ఇంట్లో ఉన్నదంతా ఊడ్చుకుపోయాడు. 

ఈ ఘటనలో  దాదాపు అరకిలో బంగారం, మూడు కిలోల వెండి ఎత్తుకుపోగా, కొంత అమ్ముకున్నాడు. సుమారు 42  తులాల గోల్డ్​, సుమారు రెండున్నర కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను మల్కాజిగిరి జోన్ డీసీపీ శ్రీధర్ వెల్లడించారు. కూకట్​పల్లి నిజాంపేట పరిధిలో హాస్టల్ కొనసాగిస్తున్న రేగుల చంద్రశేఖర్ (31)ను ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీంతో అతడు తన స్నేహితురాలితో తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, సాయం చేయాలని కోరాడు. దీంతో ఆమె తన పిన్ని మణె పద్మావతి నేరేడుమెట్​లో ఉంటుందని, ఆమె దగ్గర చాలా బంగారం ఉందని చెప్పింది. 

నెల క్రితం చంద్రశేఖర్ కు తన పిన్ని ఇంటి తాళాలు ఇచ్చింది. తెలియకుండా బంగారం తీసుకుని అవసరం తీర్చుకున్నాక మల్లీ తిరిగి అక్కడే పెట్టాలని కోరింది. దీంతో డూప్లికేట్​తయారు చేసుకుని అసలు కీ ఆమెకే ఇచ్చేశాడు. పద్మావతి అక్టోబర్ 20న కూరగాయల మార్కెట్‌‌‌‌కు వెళ్లగా, డూప్లికేట్‌‌‌‌తాళంతో ఇంటి తలుపులు తెరిచిన చంద్రశేఖర్​556 గ్రాముల బంగారు ఆభరణాలు, 2.9 కిలోల వెండి వస్తువులు, ముత్యాల ఆభరణాలను దోచుకెళ్లారు. 

పోలీసులు సీసీటీవీ ఫుటేజీలతో పాటు టెక్నికల్​ఎవిడెన్స్​తో నవంబర్ 5న తిరుమలగిరి సమీపంలో చంద్రశేఖర్ ను అదుపులోకి తీసుకున్నారు. సహచరుడు షాజీతో కలిసి చోరీ చేసినట్టు నిందితుడు అంగీకరించాడు. చోరీ చేసిన బంగారంలో 13 తులాలను గుంటూరులో, 25 తులాలను హైదరాబాద్‌‌‌‌లో అమ్మానని, 18 తులాల బంగారం తన వద్దే ఉందని చెప్పాడు. పోలీసులు 429.92 గ్రాముల బంగారం, 2,974 గ్రాముల వెండి వస్తువులు, ముత్యాల ఆభరణాలను రికవరీ చేశారు.