అమితాబ్ ఇంటికి బాంబ్ బెదిరింపు.. బాంబే హైకోర్టు, మహాలక్ష్మి రేస్‌‌‌‌‌‌‌‌ కోర్స్ వద్ద హైఅలర్ట్

అమితాబ్ ఇంటికి బాంబ్ బెదిరింపు.. బాంబే హైకోర్టు, మహాలక్ష్మి రేస్‌‌‌‌‌‌‌‌ కోర్స్ వద్ద హైఅలర్ట్

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మరోసారి బాంబ్ బెదిరింపులు తీవ్ర కలకలం సృష్టించాయి. బాంబే హైకోర్టుతో పాటు ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ నివాసం ‘జల్సా’, మహాలక్ష్మి రేస్‌‌‌‌‌‌‌‌కోర్స్‌‌‌‌‌‌‌‌లో బాంబు పెట్టామంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఈ-మెయిల్ ద్వారా హెచ్చరికలు పంపారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు, ముంబై పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి.

మూడు ప్రాంతాల్లో క్షుణ్ణంగా సోదాలు..

ముంబై హైకోర్టుకు వచ్చిన ఒక బెదిరింపు ఈ-మెయిల్‌‌‌‌‌‌‌‌లో బాంబే హైకోర్టు, మహాలక్ష్మి రేస్‌‌‌‌‌‌‌‌కోర్స్, బాలీవుడ్ సూపర్‌‌‌‌‌‌‌‌స్టార్ అమితాబ్ బచ్చన్ ఇల్లు ‘జల్సా’ పేర్లను ప్రస్తావించారు. ఈ సమాచారం అందిన వెంటనే బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్, స్థానిక పోలీసులు మూడు ప్రాంతాలకు చేరుకుని క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు. 

అయితే, ఇప్పటివరకు ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని, భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశామని పోలీసు వర్గాలు వెల్లడించారు. ప్రస్తుతం ఈ-మెయిల్ ఎవరి నుంచి వచ్చింది, దాని మూలాలు ఎక్కడ ఉన్నాయనే కోణంలో ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గతంలోనూ ఇలాంటి బెదిరింపులు..

ముంబైలో ప్రముఖ ప్రదేశాలు, ప్రముఖుల కార్యాలయాలను టార్గెట్ చేస్తూ నకిలీ బెదిరింపులు రావడం ఇటీవల కాలంలో ఎక్కువైంది. గత అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో ముంబై మేయర్ కార్యాలయానికి కూడా ఇలాంటి ఈ-మెయిల్ బెదిరింపులు వచ్చాయి. మేయర్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌తోపాటు డిప్యూటీ మేయర్ సంజయ్ శంకర్ ఘాడిని ఉద్దేశించి వచ్చిన ఆ మెయిల్‌‌‌‌‌‌‌‌లో.. మధ్యాహ్నం 3:11 గంటలకు మేయర్ కార్యాలయంపై బాంబు దాడి చేస్తామని, మహాలక్ష్మి రేస్‌‌‌‌‌‌‌‌కోర్స్‌‌‌‌‌‌‌‌లో నవంబర్ 27న బాంబు పేలుడు సంభవిస్తుందని హెచ్చరించారు. ఇప్పుడు తాజాగా వచ్చిన ఈ-మెయిల్‌‌‌‌‌‌‌‌లోనూ మరోసారి మహాలక్ష్మి రేస్‌‌‌‌‌‌‌‌కోర్స్ ప్రస్తావన రావడం గమనార్హం.