బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నుంచి రాబోతున్న సినిమా ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’. చిత్రాంగద సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని అపూర్వ లఖియా తెరకెక్కించారు. 2020లో భారత్ - చైనా మధ్య గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ ఏడాది ప్రారంభంలో షూటింగ్ పూర్తయింది. ఏప్రిల్‌లో విడుదలకు ప్లాన్ చేసినా ఆలస్యమైంది. సెన్సార్ బోర్డు, రక్షణ శాఖ అభ్యంతరాలతో నలభై శాతం రీషూట్ చేయడం వల్లే ఆలస్యం జరిగిందని, టైటిల్ మార్పుకు కూడా కారణం ఇదేనని ప్రచారం జరుగుతోంది.
అయితే శుక్రవారం జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఈ ప్రచారంపై సల్మాన్ ఖాన్ స్పందించారు. ‘‘మేము చైనాకు వ్యతిరేకంగా వెళ్తున్నామని, స్క్రిప్ట్‌ను మార్చాలని, తిరిగి రాయాలని ప్రభుత్వం మాపై ఒత్తిడి తెచ్చిందని వస్తున్న కథనాలన్నీ పూర్తిగా అవాస్తవం, అర్థరహితం. మేము ఈ సినిమాను సైనికుల గురించి, వాళ్ల కుటుంబాల మానసిక సంఘర్షణను వాస్తవిక కోణంలో చూపించాలి అనుకున్నాం. అందుకే ఎక్కువ టైమ్ తీసుకున్నాం.
ముందుగా అనుకున్న కథలో మార్పులు చేశాం. ఇందులో ఎవరినీ నెగెటివ్‌గా చూపించలేదు, ఎవరికీ మా సినిమా వ్యతిరేకంగా కాదు’ అని చెప్పారు. అంతేకాదు.. ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ అన్నది వర్కింగ్ టైటిల్ మాత్రమేనని, కథకు తగ్గట్టుగా ‘మాతృభూమి’ టైటిల్ కరెక్ట్ అనిపించి మార్చామని క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది.
