గౌరవెల్లి ప్రాజెక్టును పక్కాగా పూర్తి చేస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్

గౌరవెల్లి ప్రాజెక్టును పక్కాగా పూర్తి చేస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్, వెలుగు: గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి హుస్నాబాద్ గడ్డను సస్యశ్యామలం చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అర్హులందరికీ పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం ఆయన హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్​లో ముఖ్య నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. 2007లో ప్రారంభమైన గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు నిధులు తీసుకొచ్చామని, సుప్రీంకోర్టు కేసులు క్లియర్​చేసి కాల్వల భూసేకరణ వేగవంతం చేస్తున్నామని తెలిపారు. 

గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను అనుసంధానం చేసి గండిపల్లి కింద 14 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. మిడ్ మానేరు ఫేజ్-3 ద్వారా నీరందించేందుకు పనులు జరుగుతున్నాయని చెప్పారు. దీపావళి మరుసటి రోజు నుంచి నియోజకవర్గంలో 136 వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ నెల 19న ఇందిరమ్మ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా మహిళలకు సీఎం చేతుల మీదుగా చిలకపచ్చ రంగు చీరలు పంపిణీ చేస్తామని, రూ.5 లక్షల ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఈ నెల 16 నుంచి దివ్యాంగులు, వృద్ధులకు ఉచితంగా ఉపకరణాలు అందిస్తామన్నారు. అంతకుముందు లక్ష్మీ గార్డెన్స్‌‌‌‌లో నిర్వహించిన శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ 'ఆరేవియా-2026' ఫ్రెషర్స్ పార్టీలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.