కరువు సాయంపై కేబినెట్ లో చర్చించరా?..25 లక్షల ఎకరాల్లో ఎండిపోయిన పంటలు :మాజీ మంత్రి హరీశ్ రావు

కరువు సాయంపై కేబినెట్ లో చర్చించరా?..25 లక్షల ఎకరాల్లో ఎండిపోయిన పంటలు :మాజీ మంత్రి హరీశ్ రావు

నర్సాపూర్/ చిలప్​చెడ్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని రైతులను ఎలా ఆదుకోవాలనే అంశంపై క్యాబినెట్‌‌‌‌లో కనీసం చర్చించకపోవడం దారుణమని మాజీ మంత్రి, బీఆర్‌‌‌‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు విమర్శించారు. గ్లోబల్ సమ్మిట్ కోసం వందల కోట్లు ఖర్చు చేసేందుకు, ప్రచారానికి సమయం ఉన్న ప్రభుత్వానికి రైతులకు పరిహారం అందించేందుకు మాత్రం సమయం లేదా అని ప్రశ్నించారు. శుక్రవారం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని చిలిపిచెడ్, హత్నూర మండలాల్లో కరెంటు కోతలు, సాగునీటి కొరతతో ఎండిపోయిన వరి పొలాలను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌‌‌‌తో కలిసి హరీశ్ రావు పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పడిన కరువు ప్రకృతి వైపరీత్యం కాదని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వచ్చిందని ఆరోపించారు. 

దేవాదుల ప్రాజెక్టులో పది మోటార్లకు గాను ఎనిమిది మాత్రమే నడిపి, అవి కూడా రోజుకు ఎనిమిది గంటలే పనిచేయడంతో ఆశించిన స్థాయిలో నీటిని ఎత్తిపోసుకోలేకపోయారని విమర్శించారు. కల్వకుర్తి ప్రాజెక్టులోనూ ఐదు మోటార్లతో 60 టీఎంసీల నీటిని ఎత్తుకునే అవకాశం ఉన్నా, రెండు మూడు మోటార్లనే నడిపారని ఆరోపించారు. నర్సాపూర్ నియోజకవర్గంలో 15,910 మంది రైతులకు రుణమాఫీ కాలేదని పేర్కొన్నారు. సింగూరు డ్యామ్‌‌‌‌లో గతంలో 20 టీఎంసీల నీరు ఉండగా, ప్రస్తుతం కేవలం 2 టీఎంసీలే మిగిలాయని తెలిపారు. ముందస్తు ప్రణాళిక లేకుండా నీటిని ఖాళీ చేయడంతో సాగు, తాగునీటి సమస్యలు ఏర్పడ్డాయని విమర్శించారు. సింగూరులో మిగిలిన రెండు టీఎంసీల నీటిని కాపాడి, సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ప్రజలకు వచ్చే ఎనిమిది నెలల పాటు తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.