- బీజీఎల్ లాంచర్స్, ఎలక్ట్రిక్ డిటోనేటర్లు స్వాధీనం
వెంకటాపురం వెలుగు: తెలంగాణ, చత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుటల్లో మావోయిస్టులు నిలువ చేసిన భారీ ఆయుధ డంపులను పోలీసులు కనుగొన్నారు. బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్, తడపల(ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధి) అడవులను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్న క్రమంలో ఈ డంపులు లభ్యమయ్యాయి. బీజాపూర్ పోలీసులు సీఆర్పీఎఫ్ 196 బెటాలియన్, 204 కోబ్రా కలిసి ఆపరేషన్ నిర్వహించారు. బీజాపూర్ ఏఎస్పీ రాహుల్ బన్సాల్ తెలిపిన వివరాల ప్రకారం... కర్రెగుటల్లో కూబింగ్ బనిర్వహిస్తున్న భద్రతా బలగాలు తడపల ఎఫ్ఓబీ క్యాంపునకు 1.5 కిలోమీటర్ల దూరంలో కొండలపై మావోయిస్టులు ఏర్పాటు చేసిన డంపులో 711 బీజీఎల్ సెల్స్(బారెల్ గ్రానైట్ లాంచర్స్) ల్యాండ్ మైన్స్ (ఐఈడీలు)ను గుర్తించాయి.
అలాగే పూజారి కాంకేర్ గ్రామ సమీపంలోని శుక్రవారం పోలీసులు వెలికితీసిన డంపులో455 ఎలక్ట్రిక్, 500 నాన్-ఎలక్ట్రిక్ డిటోనేటర్లతో పాటు, బ్యాటరీ ఛార్జర్లు, మల్టీమీటర్లు, మల్టీ-యూఎస్బీ పోర్ట్ మొబైల్ ఛార్జర్లు, యాంటెనాలు, రేడియో సెట్లు, రిలే కంట్రోల్ సర్క్యూట్ బోర్డులు మొదలైనవాటిని స్వాధీనం చేసుకున్నారు. కర్రెగుటల్లో మావోయిస్టుల ఏర్పాటు చేసిన మందు పాతరలు ఉన్నాయని, భద్రతా కారణాల దృశ్య కర్రెగుట్టలపై సాధారణ పౌరులు వెళ్లకూడదని ఏఎస్పీ సూచించారు.
