- బాధ్యులైన డాక్టర్ల లైసెన్సులు రద్దు చేయండి: మంత్రి దామోదర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఐవీఎఫ్ సెంటర్ల ముసుగులో జరుగుతున్న అక్రమాలు, దోపిడీపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు. అండాల అక్రమ సేకరణ ముఠాతో సంబంధాలున్న ప్రైవేట్ ఐవీఎఫ్ సెంటర్లను శాశ్వతంగా సీజ్ చేయడంతో పాటు, నిబంధనలు ఉల్లంఘించే కేంద్రాల రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. కోఠిలోని టీజీఎంఎస్ఐడీసీ కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, కమిషనర్ ముషారఫ్ అలీ ఫారూఖీలతో కలిసి నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.
ఇటీవల పట్టుబడిన అండాల సేకరణ ముఠా కేసులోనూ సమగ్ర విచారణ జరిపి దోషులకు కఠిన శిక్షలు పడేలా పోలీసులకు సహకరించాలని సూచించారు. అక్రమాల్లో భాగస్వాములైన డాక్టర్ల లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేసేలా స్టేట్, నేషనల్ మెడికల్ కౌన్సిల్స్తో సంప్రదింపులు జరిపి సిఫారసు చేయాలని స్పష్టం చేశారు. సరోగసి, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్టీ) చట్టాల పటిష్ఠ అమలుపై దృష్టి సారించాలని, ఇతర రాష్ట్రాల విధానాలను స్టడీ చేసి అదనపు మార్గదర్శకాల రూపకల్పనకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీని మంత్రి ఆదేశించారు.
