వెయ్యి పడకల ఆస్పత్రి పనులు స్పీడప్ : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

వెయ్యి పడకల ఆస్పత్రి పనులు స్పీడప్ :  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్​నగర్, వెలుగు :  సూర్యాపేట జిల్లా కేంద్రంలో రూ.190 కోట్లతో నిర్మిస్తున్న 1000 పడకల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నూతన భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన, రెండు, మూడు నెలల్లో పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. రూ.1.17 కోట్లతో కొనుగోలు చేసిన ఆధునిక వైద్య పరికరాలు, డీజిల్ లైట్ వెంటిలేటర్లు, మైక్రోటోన్, కటరీ మెషిన్, బ్రోంకోస్కోప్, డెంటల్ చైర్, సీ-ఆర్మ్ పరికరాలను మంత్రి ప్రారంభించారు. 

కాంపెన్సేటరీ అపాయింట్‌‌‌‌మెంట్ ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. అనంతరం రవి మహల్‌‌‌‌లో నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. హుజూర్‌‌‌‌నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రామస్వామి గుట్ట వద్ద 110 ఎకరాల్లో నిర్మిస్తున్న 2,160 ఇందిరమ్మ ఇండ్ల మోడల్ హౌసింగ్ కాలనీలోని విద్యుత్, వీధి దీపాలు, గ్రీనరీ, తాగునీటి సదుపాయాలు, పైలాన్, సభాస్థలి పనులను మంత్రి పరిశీలించారు. మిగిలిన పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని, కాలనీని త్వరలో ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.