నామినేట్ సరికాదు.. ఎన్నికలు నిర్వహించాల్సిందే..తెలంగాణ బార్ కౌన్సిల్ కమిటీల నియామకంపై సుప్రీం తీర్పు

నామినేట్ సరికాదు..  ఎన్నికలు నిర్వహించాల్సిందే..తెలంగాణ బార్ కౌన్సిల్ కమిటీల నియామకంపై సుప్రీం తీర్పు
  • ఎన్నికలు జరిగే వరకు అమలులో బీసీఐ మధ్యంతర ఉత్తర్వులు

న్యూఢిల్లీ, వెలుగు: నామినేటెడ్ పద్ధతిలో కమిటీలను నియమించడం సరికాదని, చట్టబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ బార్ కౌన్సిల్ కు సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎన్నికలు జరిగే వరకూ బీసీఐ విధించిన మధ్యంతర స్టే కొనసాగుతుందని పేర్కొంది. ఇటీవల తెలంగాణ బార్ కౌన్సిల్ ప్రివిలేజ్, లైబ్రరీ, ఫైనాన్స్, ఎగ్జిక్యూటివ్, ఎన్ రోల్ మెంట్, డిసిప్లినరీ కమిటీలను ప్రకటించింది. కౌన్సిల్ తీసుకొన్న ఈ నిర్ణయాన్ని వెంకట్ యాదవ్, పొన్నం అశోక్ గౌడ్, రోహిణి స్మిత, సునీల్ గౌడ్, ఎంఏకే ముఖీద్.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ)కు కంప్లైంట్ చేశారు. ఈ కమిటీల ఏర్పాటు అడ్వొకేట్స్ యాక్ట్-1961లోని నిబంధనలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. ఈ అంశాలను పరిశీలించిన బీసీఐ.. కమిటీల ఏర్పాటుపై అక్టోబరు 23న మధ్యంతర స్టే ఇస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై  తెలంగాణ బార్ కౌన్సిల్ సుప్రీంకోర్టుకు ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను శుక్రవారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది.

చైర్మన్​కు నామినేడెట్ అధికారముంది

బార్ కౌన్సిల్ తరపున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు, ఏవోఆర్ పీ.మోహిత్ రావులు వాదనలు వినిపించారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ కు 23 మంది సభ్యులు ఎన్నిక కాగా..18 మంది ప్రతినిధులు కమిటీల నియామక బాధ్యతను చైర్మన్ కు అప్పగిస్తూ తీర్మానం జరిగిందని బెంచ్ కు నివేదించారు. ఎన్నికల ప్రక్రియలో పోటీ లేని/ ఏకగ్రీవం అయిన పరిస్థితుల్లో కమిటీలను నామినేట్ చేసే అధికారం చైర్మన్ కు ఉంటుందని వాదించారు. ఎన్నికలు నిర్వహించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కోర్టుకు నివేదించారు. 

ఈ సందర్బంగా ధర్మాసనం జోక్యం చేసుకొని అసలు ఎన్నికల ప్రక్రియ ప్రారంభించకుండానే ఏకగ్రీవం చేయడం వల్ల కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశముందని వ్యాఖ్యానించింది. చట్టబద్ధమైన ఎన్నికల ప్రక్రియను పక్కన పెట్టలేమని, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత పూర్తి నివేదికను బీసీఐకి పంపాలని పేర్కొంటూ విచారణను ముగిస్తున్నట్లు వెల్లడించింది.