- ప్రయాణికుల సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు పరిశీలన
న్యూఢిల్లీ: దీపావళి, ఛట్ పండుగల వేళ ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్సందర్శించారు. స్టేషన్లోని సౌకర్యాలు, భద్రతా చర్యలను పరిశీలించారు. ప్రయాణికులతో మాట్లాడి వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పండుగల సమయంలో ఏటా ప్రయాణికుల రద్దీ గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందన్నారు. ప్రయాణికులు స్టేషన్కు వచ్చిన తర్వాత తక్కువ సమయంలోనే తమ రైళ్లను చేరుకునేలా ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు పేర్కొన్నారు.
ఢిల్లీ రైల్వే పరిధిలో సాధారణంగా రోజుకు 5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా, పండుగల రద్దీ వేళ ఆ సంఖ్య 8 లక్షలకు చేరుకుంది. రద్దీ దృష్ట్యా ఆర్పీఎఫ్ బలగాలను అదనంగా మోహరించడంతో పాటు నిఘా పెంచేందుకు అదనంగా 700 ఏఐ కెమెరాలు అమర్చారు. రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్ ప్రయాణికుల రద్దీని క్రమబద్ధీకరించడానికి ఒక ఉమ్మడి హోల్డింగ్ ఏరియాను ఏర్పాటు చేశారు. లగేజ్ చెకింగ్ ప్రక్రియను స్టేషన్ భవనం వెలుపలికి మార్చారు. అదనపు టికెటింగ్ కౌంటర్లు, తాగునీరు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, నిరంతర లగేజీ స్క్రీనింగ్ వసతులు కల్పించారు.
