చండీగఢ్: పంజాబ్‌లోని సరాయ్ బంజారా రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం ‘కర్మభూమి ఎక్స్‌ప్రెస్’ (రైలు నంబర్:12508)లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అమృత్సర్ నుంచి న్యూ జల్పైగురి మధ్య నడిచే ఈ రైలులోని నాలుగు బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.
వివరాల్లోకి వెళ్తే.. అమృత్సర్ నుంచి బయలుదేరిన ఈ రైలు ఇంజిన్ వైపు నుంచి ఐదో బోగీలో తొలుత మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత ఆ మంటలు పక్కనే ఉన్న మరో మూడు బోగీలకు వేగంగా వ్యాపించాయి. రాజపురాకు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బసంత్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
రైలు బోగీల నుంచి పొగలు, మంటలను చూసి ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు, అత్యవసర సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
