దేశ రక్షణలో భాగంగా సైనికులు తమ జీవితంలో విలువైన వయసు (18 నుంచి 40 సంవత్సరాల)ను దేశానికి అంకితం చేసి సుమారు ఇరవై సంవత్సరాల తర్వాత మధ్య వయసులో పదవీ విరమణ పొందుతారు. అలాంటి సైనికులకు రీ సెటిల్మెంట్‌లో భాగంగా 5 / 2.5 ఎకరాల అసైన్డ్ భూములు కేటాయించాలని తేదీ 30.04.1963 జీవో ఎం.ఎస్ నం.743 ( రెవెన్యూ డిపార్ట్‌మెంట్)లో ఉన్నది. ఈ జీవో ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి, రెండో ప్రపంచ యుద్ధ సైనికులకు పునరావాసం కింద భూములు కేటాయించారు.
అనంతరం భారత్, - చైనా 1962, భారత్, - పాకిస్తాన్ 1965, - 1971, కార్గిల్ యుద్ధం 1999 మాజీ సైనికులకు కూడా భూములు కేటాయించారు. అదనంగా అనేకమంది సర్వీసులో ఉన్న సైనికులకు పదవీ విరమణ పొందిన మాజీ సైనికులకు ఈ జీవో ఆధారంగానే అసైన్డ్ భూములు కేటాయించారు.
మాజీ సైనికుల ఆశలపై నీళ్లు
తెలంగాణలో పన్నెండేళ్ల ప్రభుత్వాల పాలనలో మాజీ సైనికులకు అసైన్డ్ భూములు అందని ద్రాక్షలా మారాయి. అసైన్డ్ భూముల పరిమాణం తక్కువగా ఉన్నందున మాజీ సైనికులకు భూములు కేటాయించలేకపోతున్నాం అని గత ప్రభుత్వం సమాధానం చెబితే, ప్రస్తుత ప్రభుత్వం ఏకంగా మాజీ సైనికులకు భూములు ఇవ్వము అంటూ జీవో ఎం.ఎస్ నం.185 రెవెన్యూ (ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ I ) డిపార్ట్‌మెంట్, 1.09.2026న ఉత్తర్వులు ఇచ్చి మాజీ సైనికుల ఆశలపై నీళ్లు చల్లింది. కేవలం సర్వీసులో వీరమరణం పొందిన, ప్రమాదానికి గురై అంగవైకల్యం పొందిన సైనికులు మాత్రమే300 గజాల అసైన్డ్ ఇంటి స్థలానికి అర్హులు అంటూ గైడ్‌లైన్స్ విడుదల చేసింది.
గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ద్వారా అసైన్డ్ భూములు పెద్ద ఎత్తున కొల్లగొట్టారు అని ఆరోపణలు చేసి, ధరణి పోర్టల్‌ను పోర్టల్ పేరు మార్చి భూభారతి తెచ్చి రెండేళ్లు గడుస్తోంది. హైదరాబాద్ చుట్టూ, రాష్ట్ర వ్యాప్తంగా లక్షల కోట్లు విలువైన భూములు కొల్లగొట్టారని మొదట ధరణి కమిటీ, ఆపైన ఫోరెన్సిక్ ఆడిట్, స్పెషల్ ఎంక్వైరీ టీమ్ (సెట్), మొన్న అధికారుల కమిటీలు వేశారు. అసెంబ్లీ సాక్షిగా రెవెన్యూ శాఖ మంత్రి అసైన్డ్ భూములు 23 వేల ఎకరాలు 13 వేల ఖాతాలకు మళ్ళాయి అంటూ ప్రకటన చేశారు.
మాజీ సైనికులను ప్రభుత్వం ఆదుకోవాలి
తెలంగాణ మాజీ సైనికుల సంఘాలను సంప్రదించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా 5 / 2.5 ఎకరాల అసైన్డ్ భూములు, అదనంగా హౌసింగ్ సొసైటీలకు, మాజీ సైనిక సంఘాలకు భూములు ఇవ్వము అంటూ మాజీ సైనికుల పునరావాసంపై మరణ శాసనం రాసింది. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి. మార్పు అంటూ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మాజీ సైనికుల కోసం ఆరు గ్యారంటీలలో ఆర్థికసాయం ఇస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటివరకు దాని ఊసేలేదు.
ఇచ్చిన హామీ నెరవేర్చకుండా.. మాజీ సైనికులకు అసైన్డ్ భూములు కేటాయించాలి అని ఉన్న జీవోలను రద్దు చేస్తూ మాజీ సైనికుల కు అన్యాయం చేస్తున్నది. ప్రభుత్వం తక్షణమే ఈ జీవోను రద్దు చేసి మాజీ సైనికులకు ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా గుర్తించిన అసైన్డ్ భూములు 5 / 2.5 ఎకరాలు జిల్లాలవారీగా కేటాయించాలి. లేనియెడల ప్రత్యామ్నాయంగా ఒక్కో జిల్లాలో ఆ జిల్లా సంఖ్యనుబట్టి ప్రత్యేక హౌసింగ్ కాలనీ ఏర్పాటు చేయాలి. అదనంగా 33 జిల్లాలలో సైనిక సంక్షేమ కమ్యూనిటీ హాలు కోసం ఐదెకరాల అసైన్డ్ భూమి, నిధులు కేటాయించాలి.
బందెల సురేందర్ రెడ్డి, ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్
* ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ [email protected]
* రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
* స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
