భౌతిక హద్దులు మారిస్తే ఓటరు తీర్పు మారేనా ?

భౌతిక హద్దులు మారిస్తే ఓటరు తీర్పు మారేనా ?

బీజేపీ వ్యూహకర్తలు ఇప్పటికే మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుపెట్టి  దేశవ్యాప్త పునర్విభజన (డిలిమిటేషన్)కు యత్నించి విఫలమయ్యారు. అయినా, మళ్లీ డిలిమిటేషన్ బిల్లును తెచ్చేందుకు పార్టీ నాయకత్వం, కేంద్ర సర్కారు పెద్దలు ముమ్మర యత్నాలు చేస్తున్నారు. 2021లో నిర్వహించాల్సిన జనాభా లెక్కల్లో జాప్యం, ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను ముందుకుతోయడం వ్యూహంలో భాగమనే ప్రచారముంది.

జనాభా ప్రాతిపదికన అంటే దక్షిణాది నుంచి వ్యతిరేకత వస్తున్నందున అన్నిచోట్లా 50 శాతం స్థానాల పెంపును ప్రతిపాదిస్తున్నారు.  దీంతో మహిళా (మూడో వంతు) రిజర్వేషన్లను పెరిగే  కొత్త నియోజకవర్గాల సంఖ్యతో సర్దుబాటు చేయొచ్చన్నది వారి ఆలోచన. ఇదేకాక కేంద్రంలో, మెజారిటీ రాష్ట్రాల్లో పాలకపక్షంగా ఉన్న బీజేపీ, నియోజకవర్గాల భౌతిక స్వరూపం మార్చే ఈ ‘పునర్విభజన’లో ‘చేయివాటం’ చూపొచ్చనే ఎత్తుగడ ఉన్నట్టుంది.

సంప్రదాయంగా ప్రత్యర్థులకు దన్నుగా ఉండే సమూహ ఓట్లను వేర్వేరు స్థానాల్లోకి ‘చీల్చడం’, తమకు అనుకూలంగా ఉంటాయనే ఓట్లను ఒక స్థానం పరిధిలోకి ‘చేర్చడం’ అనుకూలిస్తుందనే వాదన ఒకటుంది.  కానీ,  ట్రంప్ నాయకత్వంలో అమెరికాలో  రిపబ్లికన్ పార్టీ గోప్యంగా, ఏక పక్షంగా ఎన్నికల సరిహద్దుల మ్యాప్‌‌‌‌లను మార్చేందుకు చేపట్టిన ప్రయత్నం మధ్యంతర (మిడ్ టర్మ్) ఎన్నికల్లో బెడిసింది.

ఇందులో బీజేపీ వ్యూహకర్తలు నేర్చుకోవాల్సిన గుణ పాఠాలున్నాయి. అమెరికాలో పాలకపక్షమైన రిపబ్లికన్ పార్టీ 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ నియోజకవర్గ సరిహద్దులను (రీడిస్ట్రిక్టింగ్) తిరగరాసింది. ఈ 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిధిలోని డెమొక్రాట్ల స్థానాలను లాక్కోవడానికి ట్రంప్ వేసిన ఈ సరిహద్దుల పాచికలు మిడ్ టర్మ్ ఎన్నికల్లో దారుణంగా తిరగబడ్డాయి.

డెమొక్రాట్లను దెబ్బతీయడం దేవుడెరుగు, రిపబ్లికన్లు తాము ఆశించిన అత్యధిక స్థానాల్లో ఓడిపోవడమే కాకుండా, దశాబ్దాలుగా తిరుగులేని తమ కంచుకోటల్లోనే  తీవ్రమైన ఎదురుదెబ్బలు చవిచూడాల్సి వచ్చింది.  గెర్రీమాండరింగ్.. అంటే అనుకూల ఓటర్లను ఒకేచోట చేర్చడం (ప్యాకింగ్), వివిధ నియోజకవర్గాల్లోకి ముక్కలుచేసి, చెదరగొట్టడం (క్రాకింగ్) ద్వారా ఎన్నికల సరిహద్దులను మార్చే పద్ధతి.

తమకు అనుకూలంగా ఉండే ఓటర్లు తమకే మద్దతిస్తారనే నమ్మకంతో భౌగోళిక పునర్విభజనల్లో అధికారపక్షాలు ఈ పంథాను అవలంబిస్తాయి. కానీ, పార్టీకి సంప్రదాయంగా మద్దతుగా నిలుస్తున్న ఓటర్లే ఆ పార్టీ వైఖరి పట్ల విసిగిపోయి, తిరగబడ్డప్పుడు వ్యూహంతో పక్కాగా గీసిన నియోజకవర్గపు మ్యాప్‌‌‌‌లు కూడా రక్షించలేవు. ఎందుకంటే, అవి పూర్తిగా అప్రస్తుతంగా మారిపోతాయి.

 బీజేపీకి బంకీపూర్‌‌‌‌‌‌‌‌లో గుణపాఠం
మన దేశంలో గత ఆగస్టులో జరిగిన బిహార్‌‌‌‌‌‌‌‌లోని బంకీపూర్ ఉపఎన్నిక ఫలితం సరిగ్గా ఇదే క్షేత్ర వాస్తవాన్ని నిరూపించింది. అక్కడి సామాజిక వర్గాల కూర్పు (డెమోగ్రాఫిక్ ప్రొఫైల్) ప్రకారం బంకీపూర్ నియోజకవర్గం అచ్చంగా బీజేపీ విజయానికి తగినట్లే పక్కాగా తీర్చిదిద్దినట్లు ఉంటుంది. కానీ లోగడ ఆ పార్టీకి అండగా నిలిచిన అగ్ర కులాల మద్దతుదారులు తమ మనసు మార్చుకోవడంతో ఆ నియోజకవర్గంలోనే బీజేపీ ఊహించని రీతిలో ఘోరంగా దెబ్బతిన్నది.

సరిహద్దులను తమకు అనుకూలంగా మార్చుకునే గెర్రీమాండరింగ్ వ్యూహం అస్సాం, జమ్మూ కాశ్మీర్‌‌‌‌లలో బీజేపీకి మిశ్రమ ఫలితాచ్చింది. అస్సాంలో లభించినంత సానుకూలత జమ్మూ కాశ్మీర్‌‌‌‌లో దక్కలేదు. అక్కడ నియోజకవర్గ సరిహద్దులను తమ రాజకీయ లబ్ధికి తగినట్లుగా మార్చడంవల్ల పొందిన ప్రయోజనాలు ఎన్నికల ఫలితాల్లో కనిపించాయి. అయితే, సొంత మద్దతుదారులే పార్టీని వదిలేసి తిరగబడితే ఏమవుతుందో చూపించడానికి బంకీపూర్ ఒక స్పష్టమైన గుణపాఠానికి ఉదాహరణగా నిలిచింది.

వివాదం సద్దుమణగలేదు
దేశంలో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కేవలం అధికార మార్పిడికి సంబంధించి ‘ఫక్తు’ రాజకీయ ప్రక్రియ కాదు. అది  సమాఖ్య (ఫెడరల్) సంక్షోభానికి కారణమయ్యే ప్రమాదముంది. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక వంటి దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంట్‌‌‌‌లో తమ ప్రాతినిధ్యాన్ని, రాజకీయ ప్రాధాన్యతను కోల్పోతామనే ఆందోళనలో ఉన్నాయి.

కేవలం జనాభా ప్రాతిపదికన ఉత్తరాది రాష్ట్రాలలో సీట్లను విపరీతంగా పెంచి, రాజకీయ లబ్ధి పొందాలని పాలక పక్షం భావిస్తే అది ప్రాంతీయ అసమానతలకు, తీవ్ర అసంతృప్తికి దారితీస్తుంది. సరిహద్దులను మార్చడం ద్వారా అధికార పీఠాన్ని కాపాడుకోవచ్చనే భావన, దేశ జాతీయ సమగ్రతకే పెను సవాలుగా మారుతుంది.

కిందటి సారి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలుపెట్టి ఈ బిల్లును గట్టెక్కించడానికి యత్నించినా పాలక కూటమి విఫలమైంది. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన రాజకీయ పక్షాలు, ‘ఇండియా కూటమి’ ముఖ్య భాగస్వాములు వ్యతిరేకించడం ఇందుకు ప్రధాన కారణం. అప్పటికే చట్టమై ఉన్న మహిళా రిజర్వేషన్ అంశాన్ని ఈ నియోజకవర్గాల పునర్విభజనకు ముడిపెట్టడాన్ని కూడా విపక్షాలు అంగీ కరించలేదు. బిల్లు వీగిపోవడానికి అదీ ఓ కారణమే!

మిత్రుల నుంచీ నేర్చుకోవచ్చు!
ట్రంప్ అనుసరించిన జాతీయవాద రాజకీయాల పతనం నుంచి బీజేపీ నేర్చుకోవాల్సిన అనేక విషయాలలో నియోజకవర్గాల పునర్విభజన వైఖరి అత్యంత ముఖ్యమైనది. 2026 నాటి ఎన్నికలు తమకు ఎంతమాత్రం సులభం కావని గ్రహించిన ట్రంప్,  రిపబ్లికన్లు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై ఒత్తిడి తెచ్చి సమయంకాని సమయంలో రీడిస్ట్రిక్టింగ్ చేయించారు.  టెక్సాస్‌‌‌‌లో ఐదు సీట్లు, ఫ్లోరిడాలో నాలుగు, ఓహియోలో రెండు, అలబామా, లూసియానా, నార్త్ కరోలినా, టెన్నెస్సీలలో ఒక్కొక్క స్థానం చొప్పున అదనంగా గెలుచుకోవాలన్నది వారి ప్లాన్. కానీ.. ఫలితాలు వచ్చాక రిపబ్లికన్లు ఆశ్చర్యపోయారు.

డెమొక్రాట్లు ఆ స్థానాలన్నింటినీ కాపాడుకోవడమే కాకుండా, రిపబ్లికన్ల చేతిలో ఉన్న సీట్లను కూడా కైవసం చేసుకున్నారు. అంటే సరిహద్దుల మార్పిడి జరిపినప్పటికీ, రిపబ్లికన్లకు వ్యతిరేకంగా వీస్తున్న ప్రజాభిప్రాయ తుఫాన్‌‌‌‌ను అది ఏమాత్రం ఆపలేకపోయింది. ఒక రాష్ట్రం లేదా ప్రాంతం మొత్తంగా, కులమతాలకు అతీతంగా ప్రజలందరూ తమ రాజకీయ ప్రాధాన్యతలను మార్చుకున్నప్పుడు నియోజకవర్గ సరిహద్దులనేవి పూర్తిగా అర్థంలేని గీతలుగా మారిపోతాయి.

టెక్సాస్ సెనేట్ ఫలితంలో ఈ చారిత్రక మార్పు-జ‌‌‌‌నాభిప్రాయ బలం స్పష్టంగా కనిపించింది. దశాబ్దాల రాజకీయ సమీకరణలను తిరగరాస్తూ డెమొక్రాట్ జేమ్స్ తలారికో చేతిలో రిపబ్లికన్ అభ్యర్థి కేన్ పాక్స్టన్ ఓడిపోయారు. ఈ విజయం టెక్సాస్ రాష్ట్రంలో గత  3 దశాబ్దాలుగా రిపబ్లికన్ పార్టీకి ఉన్న ఏకఛత్రాధిపత్యానికి తెరపడేలా చేసింది. ఇది మన దేశంలోని గుజరాత్ రాష్ట్రంలో నియోజకవర్గ సరిహద్దులతో నిమిత్తం లేకుండా కొన్ని దశాబ్దాలుగా బీజేపీకి గుడ్డిగా ఓటేసే ప్రజలు, హఠాత్తుగా తమ విధేయతను వేరే పార్టీ వైపు మళ్లిస్తే ఎంతటి రాజకీయ భూకంపాన్ని తలపిస్తుందో  టెక్సాస్‌‌‌‌లో సరిగ్గా అదే జరిగింది. రిపబ్లికన్లు చేపట్టిన ఈ రీడిస్ట్రిక్టింగ్ అంతా 2024 ఎన్నికల్లో ట్రంప్ సాధించిన విజయం, అప్పటి ఓటింగ్ విధానాన్ని బట్టే జరిగింది. చాలా నియోజకవర్గాల్లో 50 శాతానికి పైగా ట్రంప్ ఓటర్లు ఉండేలా సరిహద్దులు గీశారు. కానీ రెండేళ్లు తిరిగేసరికి ఓటర్ల  ఆలోచన మారిపోయింది.  ప్రస్తుత కాంగ్రెస్‌‌‌‌తో  పోలిస్తే టెక్సాస్ రిపబ్లికన్ల సంఖ్య మునుపటి కన్నా ఒక సీటు తగ్గిపోయింది.

తలచేదొకటి జరిగేదొకటి..
ఈ సరిహద్దుల మార్పిడి ఎదురైన ముప్పు నుంచి రిపబ్లికన్లను కాపాడలేకపోగా, ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న అమెరికా రాజకీయాల్లో మరిన్ని విభజనలకు తెరలేపింది. ప్రతిగా కాలిఫోర్నియాలోని డెమొక్రాట్లు కూడా తమ సొంత సరిహద్దుల మార్పిడిని తిప్పికొట్టి, రిపబ్లికన్ల చేతిలో ఉన్న మూడు సీట్లను కైవసం చేసుకున్నారు. ఇప్పుడు మరిన్ని రాష్ట్రాలు డెమొక్రాట్ల చేతిలోకి రావడంతో, ఆ పార్టీ 2028 ఎన్నికల కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. పొలిటికల్ సోషియాలజీ దృష్టి కోణం నుంచి చూస్తే గెర్రీమాండరింగ్ వైఫల్యానికి ప్రధాన కారణం ఓటరు ఆలోచనా సరళిలో వస్తున్న వేగవంతమైన మార్పే.

పాలక వర్గాలు కేవలం పాత కుల, మత, అనుకూల లేదా సంప్రదాయ ఓటుబ్యాంకు సమీకరణల ఆధారంగా నియోజకవర్గాల సరిహద్దులు గీస్తాయి. తమకున్న ఆదరణ మరింత పెరుగుతుందని ఆశపడతాయి. కానీ, ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, స్థానిక ప్రజాప్రతినిధులపై పెరిగే వ్యతిరేకత వంటి అంశాలు ఎన్నికల సమయానికి సంప్రదాయ సమీకరణలను పూర్తిగా తుడిచిపెట్టేస్తున్నాయి.

భౌగోళిక సరిహద్దులను మార్చి ఓటర్లను ‘ప్యాక్‌‌‌‌’ చేయడం లేదా ‘క్రాక్‌‌‌‌’ చేయడం ద్వారా నిరంతరం గెలవవచ్చని అనుకోవడం పాలకుల వ్యూహపరమైన తప్పిదమే అవుతుంది.  ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశం కూడా ఈ పరిణామాలను గమనించి తగిన పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది.

దిలీప్ రెడ్డి పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్

* ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ​ఐడీ [email protected]

* రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.

* స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.