ఇప్పటికే పెట్రోల్లో ఇథనాల్ కలపటం వల్ల లక్షల వాహనాలు రిపేర్లు వస్తున్నాయని వాహనదారులు ఆందోళన చెందుతూనే ఉన్నారు. 20 శాతం ఇథనాల్ కలిపితేనే పరిస్థితి ఉలా ఉందంటే.. మరోపక్క కర్ణాటక రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వ అధికారులు చేపట్టిన పెట్రోల్ టెస్టుల్లో ఇథనాల్ 31 శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లు తేలటం దేశవ్యాప్తంగా ఆందోళనకు కారణం అయ్యింది. ప్రభుత్వ ఆయిల్ కంపెనీలకు చెందిన దాదాపు 60కి పైగా శాంపిల్స్ టెస్ట్ చేయగా వాటిలో ఎక్కువ ఇథనాల్ ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ఇదంతా చూస్తుంటే మోడీ సర్కార్ ప్రజలకు చెప్పకుండానే పెట్రోల్ లో 30 శాతం ఇథనాల్ కలిపి అమ్మేస్తోందా అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి.
అయితే కర్ణాటక ప్రభుత్వ ప్రకటనపై ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీలు కౌంటర్ ఇచ్చాయి. అసలు కర్ణాటక అధికారులు శాంపిల్స్ తీసుకోవటం వాటిని టెస్ట్ చేయటం గురించి ప్రశ్నలు గుప్పించాయి. ఎలా శాంపిల్స్ తీసుకున్నారు వాటిని ఏ పద్ధతిలో పరీక్షించి ఇథనాల్ 31 శాతం కంటే ఎక్కువ ఉందని గుర్తించారో తమకు చెప్పాలని డిమాండ్ చేశాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు సంయుక్తంగా తాము బీఐఎస్ నిబంధనలకు అనుగుణంగానే పెట్రోలులో ఇథనాల్ కలుపుతున్నామంటూ ప్రకటన విడుదల చేశాయి. దీంతో దేశవ్యాప్తంగా E20 మాటున కేంద్రం E30 పెట్రోల్ అమ్మేస్తోందంటూ సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ నడుస్తోంది కర్ణాటకలో జరుగుతున్న వివాదంతో.
కర్ణాటక ప్రభుత్వ E20 ఇంధన పరీక్షా ఫలితాలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వ్యతిరేకించాయి. నిర్దేశిత సాంకేతిక నిబంధనల ప్రకారం పరీక్షలు జరగలేదని వాదిస్తు్న్నాయి. దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సేకరించిన 893 E20 ఇంధన నమూనాలను పరీక్షించగా.. అన్నీ 19-21% మధ్య ఇథనాల్ శాతాన్ని కలిగి ఉన్నట్లు వెల్లడించాయి కంపెనీలు. కర్ణాటకలోని 56 శాంపిల్స్ లో కూడా ఇథనాల్ 19-20% మధ్యే ఉందని, సగటున 19.30% నమోదైందని స్పష్టం చేశాయి. అయితే కర్ణాటక ప్రభుత్వం రిపోర్ట్స్ గ్యాస్ క్రోమాటోగ్రఫీని పేర్కొన్నప్పటికీ, వాడిన ప్రమాణాలు, డైల్యూషన్ విధానంపై స్పష్టత లేదని OMCలు అంటున్నాయి.
అలాగే అక్టోబర్లో చేపట్టిన తనిఖీల్లో శాంపిల్స్ సేకరణ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని ఆయిల్ కంపెనీలు ఆరోపించాయి. నిబంధనల ప్రకారం 6 లీటర్లు సేకరించి, డీలర్లకు, కంపెనీలకు, పరీక్షా కేంద్రాలకు కేటాయించాలి. కానీ OMC ప్రతినిధుల ప్రమేయం లేకుండానే నమూనాలు సేకరించినట్లు.. రిటెన్షన్ నమూనాలు కూడా తమకు అందజేయలేదని తెలిపాయి. ఇక E20 ఇంధనం వల్ల వినియోగదారులకు రూ. లక్ష కోట్ల నష్టం వాటిల్లుతుందన్న అంచనాలను కంపెనీలు ఖండించాయి. వాహనాల కేటగిరీని బట్టి మైలేజ్ తగ్గుదల 6 శాతం వరకు మాత్రమే ఉంటుందని.. ఏకపక్షంగా 10 శాతం మైలేజ్ డ్రాప్ జరుగుతోందనటంలో శాస్త్రీయత లేదని అంటున్నాయి ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.
