తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా విజన్ ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్’. విద్యామంత్రిగా సైతం సీఎం రేవంత్ చెబుతున్న ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‘ లక్ష్యం నేటి ప్రాపంచిక అవసరాలకనుగుణమైన ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో కూడిన విద్యనందించడం.
అయితే, సీఎం రేవంత్ రెడ్డి విద్యకు కేటాయిస్తానని చెబుతున్న 15 శాతం బడ్జెట్ సరిపోతుందా? ఒకవేళ దీర్ఘకాలిక ప్రణాళిక అమలు జరిపినా దాని పర్యవసానాలు ఎటు దారితీస్తాయి ? తెలంగాణలో ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ, ప్రస్తుతం ఉన్న రెసిడెన్షియల్ పాఠశాల వ్యవస్థ ఉనికి, పర్యవసానాలు ఏమిటి ?
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 25 ఎకరాల సువిశాల స్థలంలో విశాలమైన తరగతి గదుల నిర్మాణం, 124 మంది ఆధునిక శిక్షణ పొందిన బోధన, బోధనేతర సిబ్బంది నియామకం, 2600 మంది విద్యార్థుల సామర్థ్యం, ఒక్కో పాఠశాల కోట్ల రూపాయల వ్యయంతో రూపొందుతున్నాయి. ఇప్పటికే ఈ పాఠశాలల నిర్మాణం కోసం రూ.15,600 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం వెల్లడించారు. ఈ పాఠశాలలు కనీసం మండలానికి ఒకటి ఏర్పరచినా 634 మండలాల్లో యంగ్ ఇండియా పాఠశాలలకు 1,26,800 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి.
ఆచరణలో ఇబ్బందులు
మొత్తం పాఠశాలలు పూర్తి అయితే 16 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందించినట్లు అవుతుంది. ఆలోచన మంచిదే! కానీ, ఆచరణలో ఎదురయ్యే ఇబ్బందులు చూద్దాం.2023-24 విద్యా గణాంకాలు ప్రకారం రాష్ట్రంలో 30,022 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 27 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.
లక్షమంది సుశిక్షితులైన బోధనా సిబ్బంది ఉంది. మరో వెయ్యి కేసీఆర్ స్థాపించిన రెసిడెన్షియల్ స్కూల్స్, కేంద్రం స్థాపించిన కేజీబీవీ, కేంద్రీయ విద్యాలయాలు, ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయి. వీటి భవితవ్యంపై స్పష్టత అవసరం. ఇప్పటికే రెసిడెన్షియల్ పాఠశాలల స్థాపన వలన ఐదులక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నమోదు తగ్గిపోయింది.
ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విధానం కనీసం మండలానికి ఒకటి నిర్మించినా లక్షల మంది విద్యార్థుల నమోదు ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్లో తగ్గిపోతుంది. సీఎం నియమించిన విద్యా కమిషన్ సేకరించిన వివరాల ప్రకారం 19వేల ప్రాథమిక పాఠశాలల్లో 13 వేల పాఠశాలల్లో 50 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్నారు.
5 వేల పైచిలుకు ఉన్నత, 4వేల పైచిలుకు ప్రాథమికోన్నత పాఠశాలలదీ అదే పరిస్థితి. అంటే బోధనా సిబ్బంది ఉండి, పిల్లలు లేని మూడొంతులు పాఠశాలల్లో ప్రజాధనం కొన్నేండ్లుగా పాలకులు వేతనాల రూపంలో వృథా చేస్తున్నారు. కేటాయించిన 23 వేల కోట్ల రూపాయలు విద్యా బడ్జెట్ లో సుమారు18 వేల కోట్లు వేతనాలకే ఖర్చు అవుతుంది.
8 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం ఏమిటి ?
ఒక్కో పాఠశాలకు 25 ఎకరాల చొప్పున 15వేల 800 ఎకరాల భూములు సేకరించాల్సి ఉంటుంది. అయితే, ఒక్కో ప్రభుత్వ పాఠశాలకు ఎకరం భూమి వేసుకున్నా 30వేల ఎకరాల విలువైన పాఠశాల స్థలాలు నిరుపయోగంగా మిగులుతాయి. గత 3 దశాబ్దాలుగా కోట్లాది రూపాయల నిధులతో నిర్మించిన సర్వశిక్షా అభియాన్ తరగతి గదులు పడావు పడతాయి.
వీటన్నింటికీ మించి సర్వశిక్షా అభియాన్ నిర్ణయించిన ఐదు కిలోమీటర్ల లోపు ఉన్నత పాఠశాల, మూడు కిలోమీటర్ల లోపు ప్రాథమికోన్నత పాఠశాల, కిలోమీటర్ లోపు ప్రాథమిక పాఠశాల ‘అందుబాటు’ అనే సమస్య తలఎత్తుతుంది? ఇంత చేసి 16లక్షల మంది విద్యార్థులకు యంగ్ ఇండియా స్కూల్స్లో ప్రవేశం కల్పిస్తే, గణాంకాల ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న 24లక్షల మందిలో 8లక్షల మంది విద్యార్థులు భవితవ్యం ఏమిటి? వారికి మన విద్యాహక్కు చట్టం -2009 ప్రకారం విద్యా సమానత, పిల్లవాడు తాను నచ్చిన పాఠశాలలో విద్య నేర్చుకునే హక్కును నిరాకరించినట్లే కదా!
మరింత అధ్యయనం అవసరం ఉన్న భూములు వినియోగం చేసుకొనకుండా మరో15 వేల ఎకరాల పంట భూములు సేకరించి,లక్ష కోట్లకు పైగా నూతన నిర్మాణాలు చేయడంలో పారదర్శకత ఉండేనా? అక్రమాలను అరికట్టడానికి ప్రభుత్వం ఎలాంటి పాలసీ తీసుకోబోతుంది? ఇట్లాంటి విషయాలన్నీ ఆలోచించాల్సిన సమయం ఇది.
కనుక ప్రపంచ విద్యా స్థాయి అందుకోవాలనే రేవంత్ రెడ్డి ఆలోచనలు స్వాగతిస్తూనే, ఇప్పుడు ఉన్న ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ, రెసిడెన్షియల్ పాఠశాల వ్యవస్థ పర్యవసానాలు, సంస్కరణ గురించి లోతుగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. ఇప్పటికే ఆకునూరి మురళి, కె.కేశవరావులతో రెండు కమీషన్లు వేసిన ప్రభుత్వం వాటి సిఫార్సులు ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ సంస్కరణలో పరిగణలోనికి తీసుకొన్న దాఖలాలు కనిపించడం లేదు.
సమస్యలను చర్చించాలి
గత కొన్ని దశాబ్దాలుగా పాలకులే విద్యా బాధ్యతల నుండి వైదొలిగేందుకు లేక ప్రజల అవసరాలకు తగ్గ పాఠశాల వ్యవస్థ మార్పులు అందించలేక పోయిన పర్యవసానంగా కుప్పలుతెప్పలుగా పెరిగిన ప్రైవేటు విద్యా వ్యవస్థను ప్రభుత్వం ఎలాంటి అంచనాలతో చూస్తుంది.
37 లక్షల విద్యార్థుల నమోదు ఉన్న 12 వేలపై చిలుకు ప్రైవేటు పాఠశాల వ్యవస్థ లోనూ ఉన్న పేద,మధ్యతరగతి విద్యార్థుల నిర్భందోచిత ప్రాథమిక విద్య గురించి, వాటిలో పని చేస్తున్న వేలాది నిరుద్యోగుల గురించి ప్రభుత్వం ఏమని ఆలోచిస్తుంది? ఇత్యాది విశాలమైన సమస్యలు చర్చించి చేపట్టే విద్యా పథకం మాత్రమే దీర్ఘకాలిక లక్ష్యంతో సఫలం అవుతుంది.
కాబట్టి రేవంత్ రెడ్డి ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ‘కలను పై సమస్యలు అన్నింటితో అనుసందానించి పథక రచన చేసినప్పుడు మాత్రమే పథకం సత్ఫలితాలు ఇస్తుంది. ఆలోచనలు ఎన్నైనా రావచ్చును కానీ, నిర్దిష్టమైన ఆచరణ, సరైన ప్రణాళికతో మాత్రమే నూతన విద్యా వ్యవస్థకు రూపకల్పన చేయగలుగుతాము.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని కోణాల్లో ఆలోచించి నూతన సవాళ్ళను ఎదుర్కోగలిగిన విద్యావ్యవస్థ రూపకల్పనలో విద్యారంగ మేధావులు, ప్రజల సలహాలు స్వీకరించడం, అనుసరించడం ప్రజాస్వామిక ఆలోచన అవుతుంది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులను వేయాలని కోరుకుందాం. విద్యా వ్యవస్థ ఆధునికీకరణను స్వాగతిద్దాం.
శ్రీనివాస్ జీడిపల్లి సోషల్ ఎనలిస్ట్
* ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ [email protected]
* రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
* స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
