నిస్వార్థ సేవకులను ప్రోత్సహించాలి

నిస్వార్థ సేవకులను ప్రోత్సహించాలి

సమాజంలో ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక లక్ష్యంతో ముందుకు సాగుతుంటారు. కొందరు సంపద సంపాదనకు ప్రాధాన్యత ఇస్తే, మరికొందరు హోదా, పేరు, ప్రతిష్ఠల కోసం ప్రయత్నిస్తారు. అయితే వీటన్నింటికీ భిన్నంగా, ఎలాంటి స్వార్థం లేకుండా సమాజమే తమ కుటుంబంగా భావించి సేవా కార్యక్రమాలు నిర్వహించే వ్యక్తులు, సంస్థలు కూడా  సమాజం మధ్య ఎంతోమంది ఉన్నారు. తమకు ఉన్నదాంట్లో కొంత ఇతరులకు పంచుతూ, ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ, నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు.

అలాంటి సేవా రంగాన్ని, సేవకులను గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు సమాజంపై కూడా ఉన్నది. ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నప్పటికీ, సమాజంలో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం చేరడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో స్వచ్ఛంద సేవా సంస్థలు, సేవా దృక్పథం కలిగిన వ్యక్తులు ప్రభుత్వానికి వారధులుగా నిలుస్తున్నారు.

నిరుపేదలకు ఆహారం అందించడం, అనాథలకు అండగా నిలవడం, నిరాశ్రయులకు వస్త్రాలు పంపిణీ చేయడం, పేద విద్యార్థులకు విద్యా సామగ్రి అందించడం, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మందులు సమకూర్చడం, ప్రకృతి విపత్తుల సమయంలో బాధి తులకు సహాయం చేయడం వంటి ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వీటిలో చాలావరకు ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా, తమ సొంత ఖర్చులతో సేవాభావంతో కొనసాగుతున్నాయి.

రాజకీయ నాయకులకు, ప్రముఖులకు, వివిధ రంగాల్లో ప్రతిభ చూపినవారికి ప్రభుత్వాలు పురస్కారాలు, గుర్తింపులు అందిస్తున్నాయి. అదే విధంగా ఎన్నో సంవత్సరాలుగా ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తులు, సంస్థలను కూడా గుర్తించి ప్రోత్సహించాలి. కేవలం అవార్డులు, ప్రశంసా పత్రాలతో సరిపెట్టకుండా, వారి సేవలను మరింత విస్తరించేందుకు అవసరమైన సహకారం అందించాలి.

వై. సంజీవ కుమార్ సోషల్​ ఎనలిస్ట్

* ఓపెన్ ​పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ఐడీ [email protected]

* రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.

* స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.