తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప భక్తుల కోసం కేరళ ప్రభుత్వం ప్రత్యేక ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తోంది. విమానాల్లో వచ్చే యాత్రికుల సౌకర్యార్థం తిరువనంతపురం, కొచ్చిన్ విమానాశ్రయాల నుంచి పంపాకు నేరుగా బస్సులు నడపాలని కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్‌ఆర్టీసీ) నిర్ణయించింది. షెడ్యూల్ ప్రకారం తిరువనంతపురం నుంచి రాత్రి 9.30 గంటలకు, కొచ్చిన్ విమానాశ్రయం నుంచి రాత్రి 8.30 గంటలకు బస్సులు బయలుదేరుతాయి.
విమానాశ్రయాల్లో యాత్రికుల విశ్రాంతికి ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. కేఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్, విమాన టికెట్ల బుకింగ్ పోర్టల్స్ ద్వారా బస్సు టికెట్లు, చార్టర్డ్ సర్వీసులను ముందుగానే బుక్ చేసుకోవచ్చు. పంపా బస్ స్టేషన్‌లో విమానాల రాకపోకల సమయాలను కూడా ప్రదర్శించనున్నారు. ఈ నెల 17 నుంచి 41 రోజుల మండల యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ప్రత్యేక రవాణా సదుపాయాలను కల్పిస్తున్నారు.
