- ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామంటేనే చలో హైదరాబాద్ వాయిదా వేశాం
- 5 రోజుల పని విధానం అమలు చేయాలి: మారం జగదీశ్వర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన ఆదేశాలను ఉన్నతాధికారులు అమలు చేయట్లేదని, ఈ విషయమై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస రావు అన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని నాంపల్లి టీజీవో భవన్ లో 205 సంఘాల ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జగదీశ్వర్ మాట్లాడుతూ.. ఉద్యోగుల పీఆర్సీ, పెండింగ్ బిల్స్, సీపీఎస్ రద్దు, హెల్త్ కార్డులు వంటి సమస్యలు పెండింగ్ ఉన్నాయన్నారు. కొన్ని రోజుల క్రితం ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని సీఎం, డిప్యూటీ సీఎం హామీ ఇవ్వడంతో చలో హైదరాబాద్ ఆందోళనను వాయిదా వేశామని తెలిపారు. కానీ, ఇప్పటివరకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేయలేదని, ఈ అంశంలో ఉన్నతాధికారుల తీరు బాధాకరమన్నారు.
ఈహెచ్ఎస్ అమలు కాక, హెల్త్ కార్డులు పనిచేయక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాలకు గుర్తింపు ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో సీపీఎస్ ను రద్దు చేశారని, కమిటీ ఏర్పాటు చేసి అక్కడకు వెళ్లి అధ్యయనం చేయాలని కోరారు. వ్యవసాయ శాఖలో ఉద్యోగులను కమిషనర్ ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. దీపావళి వరకు ప్రభుత్వం పీఆర్సీ రిపోర్ట్ ను తీసుకోవాలన్నారు. కమిటీ గడువు ముగిసినా పొడిగించలేదని చెప్పారు. ఎల్ నినో నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో 5 రోజుల పనివిధానం అమలు చేయాలన్నారు. హెచ్ వోడీ ఆఫీస్లలో పనిచేస్తున్న సూపరింటెండెంట్లను సెక్రటేరియెట్ లో ఎస్ వోలుగా నియమించాలని డిమాండ్ చేశారు.
