తొమ్మిదో క్లాస్ విద్యార్థినితో గొడవ... బ్యాగులో కొడవలి తెచ్చిన విద్యార్థి

తొమ్మిదో క్లాస్ విద్యార్థినితో గొడవ... బ్యాగులో కొడవలి తెచ్చిన విద్యార్థి
  • నాగారం లోటస్ స్కూల్‌‌‌‌లో ఘటన  
  • మేనేజ్​మెంట్​ నిర్లక్ష్యం ఉందని 
  • బాలిక తల్లిదండ్రుల ధర్నా
  • బాలుడిపై కేసు నమోదు

కీసర,వెలుగు : కీసర పీఎస్​పరిధిలోని నాగారం లోటస్‌‌‌‌ స్కూల్​లో ఓ విద్యార్థిని, విద్యార్థికి మధ్య జరిగిన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గురువారం స్కూల్​ఆవరణలో ఆడుకుంటుగా తొమ్మిదో తరగతి బాలుడు, అదే తరగతికి చెందిన బాలిక మధ్య ఏదో విషయంలో గొడవ  జరిగింది. గతంలో కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీన్ని మనసులో పెట్టుకున్న ఆ బాలుడు శుక్రవారం స్కూల్​కు వచ్చేప్పుడు తన బ్యాగులో వరి కోసే కొడవలి తీసుకువచ్చాడు. 

తోటి విద్యార్థి చూసి టీచర్​కు చెప్పడంతో వారు కొడవలిని స్వాధీనం చేసుకున్నారు. తర్వాతీ ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులను స్కూల్​కు పిలిపించి మాట్లాడారు. అయితే, కొడవలి తెచ్చిన విద్యార్థిపై యాక్షన్​ తీసుకోవాల్సింది పోయి ..తమను స్కూల్​కు పిలిపించి మాట్లాడడం ఏమిటని, తమ బిడ్డకు స్కూల్​లో భద్రత కల్పించడంలో యాజమాన్యం విఫలమైందని బాలిక తల్లిదండ్రులు స్కూల్​ప్రధాన గేటు ఎదుట ధర్నాకు దిగారు. 

గతంలో కూడా ఓసారి ఇలాగే చిన్న గొడవ జరగ్గా ఫిర్యాదు చేస్తే యాజమాన్యం చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తర్వాత బాలిక తల్లిదండ్రులు కీసర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఎలక్షన్​రెడ్డి తెలిపారు.