- అనువైన ప్రాంతాలను వెతుకుతున్నామన్న ఆమెరికా కాన్సులేట్ బృందం
హైదరాబాద్, వెలుగు: ఏఐ వినియోగం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో డాటా సెంటర్ల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను శోధిస్తున్నామని ఆమెరికా కాన్సులేట్ బృందం తెలిపింది. రాష్ట్రంలోని సింగరేణి ప్రాంతంలో వీటి ఏర్పాటుకు సుముఖంగా ఉన్నామని అమెరికన్ ప్రతినిధులు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లోని సింగరేణి భవన్‌లో అమెరికా కాన్సులెట్ బృందం సింగరేణి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. సమావేశంలో అమెరికన్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ చీఫ్ మెరెడిత్ మెజ్లర్, పొలిటికల్ అండ్ ఎకనామిక్ స్పెషలిస్ట్ లు శ్రీమలి కరి, శిబా త్రిపాఠి, కమర్షియల్ స్పెషలిస్ట్ సునేల్ కుమ్మర్ పాల్గొన్నారు.
సింగరేణి సంస్థ తరఫున సీఎండీ బుద్దా ప్రకాశ్ జ్యోతితో పాటు పలువురు డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికన్ బృంద సభ్యులు వచ్చే ఏడాది ఏప్రిల్ లో అమెరికాలో జరిగే కీలక ఖనిజ సదస్సులో పాల్గొనవలసిందిగా సింగరేణిని ఆహ్వానించారు. బుద్దా ప్రకాశ్ జ్యోతి మాట్లాడుతూ రాష్ట్రంలో మూతపడిన ఓపెన్ కాస్ట్ గనులను సద్వినియోగం చేసేందుకు సింగరేణి ప్రాంతాల్లో పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని తెలిపారు. డాటా సెంటర్లకు పీక్ అవర్స్ లో నిరంతరాయ విద్యుత్ అందించడం కోసం ఈ ప్లాంట్ లు ఉపయోగపడతాయని వివరించారు.
