హైదరాబాద్, వెలుగు: రచనలు కేవలం అలంకారప్రాయంగా కాకుండా ప్రజలకు, సమాజానికి ఉపయోగపడినప్పుడే వాటికి నిజమైన సార్థకత లభిస్తుందని తెలుగు అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ భట్టు రమేశ్ అన్నారు. నాంపల్లిలోని ఎన్టీఆర్ కళామందిరంలో శుక్రవారం సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీ ఆధ్వర్యంలో సాహితీ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. వర్సిటీ వీసీ వెలుదండ నిత్యానందరావు అధ్యక్షతన జరిగిన ఈ సభకు భట్టు రమేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. గతంలో సాహితీ ప్రక్రియలు నిర్దిష్ట భాషా చట్రాల్లో మాత్రమే కొనసాగేవని, ఆచార్య బిరుదురాజు రామరాజు తర్వాతి తరం రచయితలు సమకాలీన సామాజిక అంశాలపై విస్తృతంగా పరిశోధనలు చేసి సమాజానికి ఉపయోగపడే సాహిత్యాన్ని అందిస్తున్నారని ప్రశంసించారు.
వీసీ నిత్యానందరావు మాట్లాడుతూ.. తెలుగు భాష, సాహిత్యంలో విశేష కృషి చేస్తున్న వివిధ ప్రక్రియల రచయితలను గుర్తించి ప్రోత్సహించడం సంతోషకరమన్నారు. వర్సిటీ మాజీ రిజిస్ట్రార్, ప్రస్తుత తెలుగు అకాడమీ డైరెక్టర్ భట్టు రమేశ్‌ను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా 9 విభాగాల్లో ఉత్తమ రచనలు చేసిన రచయితలకు ఒక్కొక్కరికి రూ. 20,116 నగదు బహుమతితో పాటు శాలువా, జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు. పురస్కారం పొందిన వారిలో పద్య కవిత కేటగిరిలో దొరవేటి (ఉప్పరి చెన్నయ్య), వచన కవిత లో డాక్టర్ బాణాల శ్రీనివాసరావు, బాల సాహిత్యంలో పుల్ల రామాంజనేయులు, నవల కేటగిరిలో చిందకింది శ్రీనివాస్, నాటకంలో కేకేఎల్ స్వామి, అనువాదంలో కోడిహల్లి మురళీమోహన్, సాహిత్య విమర్శలో ఏల్చూరి మురళీధర్ రావు, వచన రచనలో వీవీ రమణ, రచయిత్రి ఉత్తమ గ్రంథం కేటగిరిలో ధూళిపాళ అరుణ ఉన్నారు.
