- సర్ పేరుతో బీజేపీ వ్యతిరేకుల పేర్లు తొలగిస్తున్నరు
- పథకాలకు ఆధార్ బదులు ఓటర్ ఐడీ అన్న కేంద్రమంత్రి
- ఆధార్ ఐదు నిమిషాల్లో వస్తదన్న రాజీవ్ రంజన్ సింగ్
- దుమారం రేపిన కేంద్రమంత్రి వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: సంక్షేమ పథకాల లబ్ధిదారుల గుర్తింపునకు ఆధార్ బదులు ఓటర్ ఐడీని వాడతామన్న కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ వ్యాఖ్యలపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ‘ఇది ఓట్ల చోరీ మాత్రమే కాదు, హక్కుల చోరీ’ అని మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ముసుగులో లక్షల మంది పేర్లను జాబితాల నుంచి తొలగిస్తున్నారని, ఇప్పుడు అదే జాబితా ఆధారంగా పథకాలు అందాలా? వద్దా? అనేది నిర్ణయిస్తారా? అని ప్రశ్నించారు. ‘పేరు తొలగిస్తే ఓటు పోతుంది. ఓటు పోతే హక్కులూ పోతాయి’ అని శుక్రవారం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ మాట్లాడిన వీడియో క్లిప్‌ను కూడా జతచేశారు.
‘రేపు రేషన్, పెన్షన్‌కూ ఇదేనా?’
‘ఈ కుట్ర చాలా లోతైనది. బీజేపీపై ఆగ్రహంగా ఉన్నవాళ్ల పేర్లనే ఎక్కువగా తొలగిస్తున్నారు. ఆపకపోతే ఇంకా ఎన్నో పేర్లు పోతాయి’ అని రాహుల్ ఆరోపించారు. ఓటర్ల జాబితా నిష్పక్షపాత ఎన్నికల సంఘం చేతుల్లో ఉండాలని, కానీ ఇప్పుడది ‘మోదీ ప్రభుత్వ ఉద్యోగి జ్ఞానేశ్ కుమార్’ చేతుల్లో ఉందని, ఓట్ల చోరీలో బీజేపీతో ఆయన కుమ్మక్కును ఆధారాలతో సహా పట్టుకున్నామని అన్నారు. ‘ఇవాళ పంచాయతీరాజ్ పథకాలు. రేపు రేషన్? పెన్షన్? ఉపాధి హామీ? ఇండ్లు? స్కాలర్షిప్లు? రిజర్వేషన్లు?’ అని ప్రశ్నించారు. ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం కాదు, ప్రభుత్వమే తనకు కావాల్సిన ప్రజలను ఎంచుకునే ‘హైజాక్ చేసిన ప్రజాస్వామ్యం’లో అదృశ్య పౌరులుగా మారుస్తున్నారని విమర్శించారు. ‘ఓటు మీ హక్కు, షరతు కాదు. పేదవాడి పెన్షన్‌ను ఓటర్ కార్డుకు బానిసను చేయలేరు. దీన్ని జరగనివ్వం’ అని స్పష్టం చేశారు.
మంత్రి ఏమన్నారంటే..
పంచాయతీరాజ్ శాఖ పథకాల కింద ఆర్థిక ప్రయోజనాలు, చెల్లింపులు పొందాలంటే ఇకపై ఆధార్ కాకుండా ఓటర్ ఐడీ (ఎపిక్) నంబర్‌తో పాటు బయోమెట్రిక్ ధ్రువీకరణ తప్పనిసరి అని పంచాయతీరాజ్, మత్స్య, పశుసంవర్ధక శాఖల మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఇటీవల రెండుసార్లు ప్రకటించారు. ఆధార్ కార్డు ఎవరికైనా ఐదు నిమిషాల్లో వచ్చేస్తుందని, అందుకే దాని విశ్వసనీయతపై సందేహాలున్నాయని చెప్పారు. అయితే ఏయే పథకాలకు ఈ నిబంధన వర్తిస్తుందో ఆయన స్పష్టం చేయలేదు. పంచాయతీరాజ్ శాఖలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేసే పథకాలు లేవని, మత్స్య, పశుసంవర్ధక శాఖ పథకాల్లో మాత్రం ఆధార్ తప్పనిసరిగా ఉందని రిపోర్టులు చెబుతున్నాయి.
ఇది ట్రైలర్ మాత్రమే: కాంగ్రెస్
మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ గురువారమే కేంద్రాన్ని నిలదీసింది. ‘ఓట్ల చోరీ ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా హక్కుల చోరీ’ అని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ విమర్శించారు. సర్ కొనసాగుతున్న సమయంలో సంక్షేమ పథకాలను ఓటర్ల జాబితాకు ముడిపెడితే పేదలు పెద్ద ఎత్తున పథకాలకు దూరమవుతారని హెచ్చరించారు. ఓటర్ ఐడీ తప్పనిసరి చేస్తే పథకాలు మరింత మందికి అందకుండా పోతాయని సీపీఎం పొలిట్‌బ్యూరో కూడా ఒక ప్రకటనలో పేర్కొంది.
