సంక్షేమ పథకాలకు ఓటర్ ఐడీ లింక్ పెద్ద కుట్ర.. బీజేపీపై రాహుల్ ఫైర్

సంక్షేమ పథకాలకు ఓటర్ ఐడీ లింక్ పెద్ద కుట్ర.. బీజేపీపై రాహుల్ ఫైర్

న్యూఢిల్లీ: సంక్షేమ పథకాల లబ్ధిదారులను గుర్తించడానికి ఆధార్ కార్డుకు బదులుగా ఓటర్ ఐడీని ఉపయోగించాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. సంక్షేమ పథకాలకు ఓటర్ ఐడీని లింక్ చేయడం అనేది కేవలం ఓట్ల దొంగతనం మాత్రమే కాదని.. ప్రజల హక్కులు దోపిడీ  చేసేందుకు బీజేపీ భారీ కుట్ర పన్నిందని ఆరోపించారు. ఓటు పోతే హక్కులు పోయినట్లేనని హెచ్చరించారు.

ఓటర్ల జాబితా ఆధారంగా సంక్షేమ పథకాల లబ్ధిని నిర్ణయిస్తే జాబితాలో పేర్లు లేని పేదలకు రేషన్, పెన్షన్లు, ఉపాధి హామీ, ఇళ్లు, స్కాలర్‌షిప్‌లు వంటి హక్కులు నిలిచిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రజాస్వామ్యం కాదని.. ప్రభుత్వమే తనకు నచ్చిన ప్రజలను ఎంచుకునే హైజాక్ చేయబడిన ప్రజాస్వామ్యమని అభివర్ణించారు. 

సర్ పేరుతో ఇప్పటికే కోట్ల ఓట్లు తొలగింపు

కేంద్ర ఎన్నికల సంఘం, సీఈసీ జ్ఞానేష్ కుమార్‎పైన రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఈసీ ఇప్పుడు ప్రధాని మోడీ చేతిలో కీలు బొమ్మ అయిన సీఈసీ జ్ఞానేష్ కుమార్ చేతుల్లో ఉందని ఆరోపించారు. బీజేపీ, ఈసీ కుమ్మక్కై ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పేరుతో ఓట్ చోరీకి పాల్పడుతున్నాయని పునరుద్ఘాటించారు. సర్ ప్రక్రియ ద్వారా ఇప్పటికే కోట్ల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు. ముఖ్యంగా బీజేపీ విధానాలపై అసంతృప్తితో ఉన్నవారిని, మోడీని వ్యతిరేకించే వారిని ఎంచుకుని మరీ ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని విమర్శించారు.