గచ్చిబౌలిలో అమెరికా వ్యాపారి అనుమానస్పద మృతి...హోటల్ లో డెడ్ బాడీ ..అసలేం జరిగింది.?

గచ్చిబౌలిలో అమెరికా వ్యాపారి అనుమానస్పద మృతి...హోటల్ లో డెడ్ బాడీ ..అసలేం జరిగింది.?

హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో అమెరికా పౌరుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. గచ్చిబౌలిలోని మారియట్ ఎగ్జిక్యూటివ్ అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న ఎస్‌ఎల్‌ఎన్ టెర్మినస్ భవనంలోని 12వ అంతస్తు, గది నంబర్ 1218లో ఆయన మృతదేహం లభ్యమైంది.

పోలీసుల వివరాల ప్రకారం.. మృతుడిని అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన మిచెల్ బ్రియాన్ లీ (41)గా గుర్తించారు. వ్యాపార పనుల నిమిత్తం తన భాగస్వామి డేవిడ్ వూతో కలిసి నవంబర్ 2న హైదరాబాద్‌కు వచ్చారు.

అయితే నవంబర్ 4వ తేదీ సాయంత్రం నుంచి బ్రియాన్ లీ ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది ఆయన గది వద్దకు వెళ్లారు.తలుపు తెరిచి చూడగా బ్రియాన్ లీ మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించగా, వారు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతికి గల ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉండగా, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.బ్రియాన్ లీ మృతికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.