Teja Sajja Wedding: తేజ సజ్జా పెళ్లి సందడి షురూ.. సీఎం రేవంత్‌రెడ్డికి వెడ్డింగ్ ఇన్విటేషన్!

Teja Sajja Wedding: తేజ సజ్జా పెళ్లి సందడి షురూ.. సీఎం రేవంత్‌రెడ్డికి వెడ్డింగ్ ఇన్విటేషన్!

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. వరుస సినిమాలతో కెరీర్‌లో దూసుకుపోతున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు తన జీవితంలో కొత్త అధ్యాయానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తన పెళ్లి విషయాన్ని వెల్లడించిన తేజ..  ప్రస్తుతం వివాహ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ రోజు ( నవంబర్ 6, 2026 ) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని స్వయంగా కలిసి తన నిశ్చితార్థ వేడుకకు ఆహ్వానించారు.

సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన తేజ సజ్జా.. ఆయనకు ప్రత్యేకంగా ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా ఇరువురూ కాసేపు ముచ్చటించుకున్నారు. తేజకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ కీలక ఘట్టానికి సిద్ధమవుతున్న తేజకు అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు.

డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ప్లాన్..

తేజ సజ్జా వివాహం డిసెంబర్‌లో రాజస్థాన్‌లోని అందమైన నగరం ఉదయ్‌పుర్‌లో జరగనుంది. నవంబర్‌లో నిశ్చితార్థ వేడుక నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నట్లు సమాచారం. ఉదయ్‌పుర్‌లో రాజసంగా పెళ్లి వేడుకను నిర్వహించిన అనంతరం హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు, స్నేహితుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.

కాబోయే భార్య ఎవరు?

తనది పెద్దలు కుదిర్చిన వివాహమని తేజ గతంలో వెల్లడించారు. కాబోయే భార్య కుటుంబానికి సినిమా పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదని, వారు టెక్నాలజీ వ్యాపార రంగంలో ఉన్నారని తెలిపారు. అయితే ఆమెకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు.

సినిమాలతో ఫుల్ బిజీ..

'జాంబీ రెడ్డి', 'హనుమాన్', 'మిరాయ్' సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తేజ.. ప్రస్తుతం 'ది ట్రైటర్స్'రియాలిటీ షోతోనూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. మరోవైపు తన హిట్ సినిమాల ఫ్రాంచైజీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తానికి ఓవైపు సినిమాలు, మరోవైపు పెళ్లి సందడి.. తేజ సజ్జా జీవితంలో ప్రస్తుతం డబుల్ సెలబ్రేషన్ నడుస్తోందన్నమాట..