హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిని కలవాలన్న బలమైన ఆకాంక్ష ఓ అభిమానిని 350 కిలోమీటర్లు నడిపించింది. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన తాయన్న.. సీఎంను కలుసుకోవాలనే సంకల్పంతో ఆదోని నుంచి హైదరాబాద్ వరకు కాలినడకన ప్రయాణించి తన అభిమానాన్ని చాటుకున్నారు.
అక్టోబర్ 29న ఆదోని నుంచి పాదయాత్ర ప్రారంభించిన తాయన్న.. దాదాపు 9 రోజుల పాటు 350 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనను కలుసుకున్నారు.
తనను కలుసుకోవడానికి ఇంత దూరం కాలినడకన వచ్చిన తాయన్నను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి అభినందించారు. సీఎం పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకునేందుకు తాయన్న చేసిన ఈ సుదీర్ఘ పాదయాత్ర పలువురి దృష్టిని ఆకర్షించింది.
