వికారాబాద్: సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్పోను ప్రారంభించడంతో పాటు సుమారు రూ.9,100 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రైతులు, పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక సంఘాల మహిళలతో ప్రత్యేక సమావేశాల్లో పాల్గొననున్నారు.
పర్యటనలో భాగంగా రేపు(నవంబర్ 7) ఉదయం 11 గంటలకు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేటలోని యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ హబ్ ప్రాంగణంలో మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్పోను సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు ఆదర్శ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. ఒంటి గంట నుంచి 2 గంటల వరకు పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణ పనులను పరిశీలించి, అనంతరం రోడ్డు మార్గంలో కొడంగల్‌లోని తన నివాసానికి చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు.
ఎల్లుండి(నవంబర్ 8) ఉదయం 9.30 గంటల నుంచి 10.20 గంటల వరకు స్వయం సహాయక సంఘాల మహిళలతో సీఎం సమావేశమవుతారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. ఉదయం 10.30 గంటలకు ఇండస్ట్రియల్ కారిడార్‌లో రూ.81 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఎకోపామ్ పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తారు. 10.45 గంటలకు హకీంపేటలో నాట్కో సంస్థ సీఎస్ఆర్ నిధులతో రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించిన జెడ్పీ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలను ప్రారంభిస్తారు. 11 గంటలకు రూ.2.35 కోట్లతో నిర్మించిన హకీంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తారు. 11.30 గంటలకు బొంరాస్‌పేటలో రూ.4.79 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాలను, 11.45 గంటలకు రూ.3 కోట్లతో నిర్మించిన పోలీస్ స్టేషన్‌ను ప్రారంభిస్తారు.
మధ్యాహ్నం 12.15 గంటలకు కొడంగల్‌లో రూ.3.80 కోట్లతో నిర్మించిన పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. 12.45 గంటలకు దుద్యాలలో రూ.3 కోట్లతో నిర్మించిన పోలీస్ స్టేషన్‌ను, మధ్యాహ్నం 1.15 గంటలకు రూ.12 కోట్లతో నిర్మించిన సమీకృత మండల కార్యాలయ భవనాన్ని ప్రారంభిస్తారు.మధ్యాహ్నం 1.40 గంటలకు కోస్గి మండలం నాచారం గ్రామంలో రూ.5,060 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న రేడియల్ రోడ్డు-2కు శంకుస్థాపన చేస్తారు. 2 గంటలకు కోస్గిలో రూ.6 కోట్లతో నిర్మించిన సైన్స్ మ్యూజియాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2.45 గంటలకు దౌల్తాబాద్ మండలం బాలంపేటలో రూ.2.35 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, 3.30 గంటలకు దౌల్తాబాద్‌లో రూ.4.79 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రారంభిస్తారు. అనంతరం కొడంగల్ నివాసానికి చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు.
నవంబర్ 9: భారీ రైతు బహిరంగ సభ
పర్యటన చివరి రోజైన నవంబర్ 9న సాయంత్రం 5 గంటలకు హకీంపేటలో నిర్వహించనున్న భారీ రైతు బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. మూడు రోజుల పర్యటనలో రైతులు, పారిశ్రామికవేత్తలు, మహిళా సంఘాలతో సమావేశాలు, పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రధానంగా సాగనున్నాయి.
