మహిళల స్వావలంబనకు అక్షరమే పునాది.. ఆడవారు విద్యావంతులైతే సమాజం అభివృద్ది: మంత్రి జూపల్లి కృష్ణారావు

మహిళల స్వావలంబనకు అక్షరమే పునాది.. ఆడవారు విద్యావంతులైతే సమాజం అభివృద్ది: మంత్రి జూపల్లి కృష్ణారావు

పానుగల్, వెలుగు: మహిళల ఆర్థిక స్వావలంబనకు అక్షరజ్ఞానం పునాది అని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా పానుగల్​మండల పరిధిలోని తెల్లరాళ్లపల్లి, శాఖాపూర్, దావత్ ఖాన్ పల్లి, రాయినిపల్లిలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. 

మహిళలు విద్యావంతులైతే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతాయని మంత్రి అన్నారు. తెల్లరాళ్లపల్లిలో మహిళలకు పలకలు, బలపాలు పంపిణీ చేశారు. మహిళల అక్షరాస్యత కార్యక్రమానికి మంత్రి తనవంతుగా రూ.20వేల ఆర్థిక సాయం అందజేశారు. 

చదవడం, రాయడం నేర్చుకునే మహిళకు రూ.5 వేల నగదు బహుమతి అందజేస్తామని ఆయన ప్రకటించారు. దావత్ ఖాన్ పల్లిలో రోశయ్య, నరసింహస్వామి సోదరులు విరాళంగా ఇచ్చిన 3 గుంటల భూమిలో గ్రామపంచాయతీ భవనానికి మంత్రి భూమిపూజ చేశారు.