హైదరాబాద్: మాదాపూర్‌లోని తమ్మిడికుంట చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ పనులు పూర్తికావడంతో నవంబర్ 10న సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి ఈ చెరువును ప్రారంభించనున్నారు. గతంలో ఆక్రమణలతో కుంచించుకుపోయిన చెరువును హైడ్రా తిరిగి పునరుద్ధరించి, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఒకప్పుడు 14 ఎకరాలకే పరిమితమైన తమ్మిడికుంట చెరువు విస్తీర్ణాన్ని హైడ్రా 29 ఎకరాలకు పెంచింది. చెరువు పరిధిలో ఆక్రమణలను తొలగించి, తిరిగి స్వాధీనం చేసుకున్న 15 ఎకరాల భూమిని చెరువు పరిధిలోకి తీసుకొచ్చింది. గతంలో చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూడా హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే.
చెరువు పునరుద్ధరణ.. సుందరీకరణ
తమ్మిడికుంటలో పేరుకుపోయిన పూడిక, వ్యర్థాలను తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేలా హైడ్రా చర్యలు చేపట్టింది. వర్షపు నీరు నేరుగా చెరువులోకి చేరేలా ఇన్లెట్లు, నాలాలను అభివృద్ధి చేసింది. చెరువు కట్ట చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడంతో పాటు పచ్చదనాన్ని పెంచి సుందరీకరణ పనులు చేపట్టింది.పిల్లలు, వృద్ధులు, స్థానిక ప్రజలు సేదతీరేందుకు వీలుగా అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించింది. సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేలా చెరువు పరిసరాలను తీర్చిదిద్దింది.
ఐటీ కారిడార్‌కు వరద ముప్పు తగ్గించేలా..
తమ్మిడికుంట చెరువు పునరుద్ధరణతో వర్షపు నీటి సంరక్షణకు, భూగర్భ జలాల పెంపునకు దోహదపడనుంది. ముఖ్యంగా మాదాపూర్, ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాల్లో వర్షపు నీటి మళ్లింపు, నిల్వకు ఈ చెరువు కీలకంగా మారనుంది.హైడ్రా మొదటి విడతలో చేపట్టిన ఆరు చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో తమ్మిడికుంట కూడా ఒకటి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యవేక్షణలో చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ పనులు కొనసాగాయి. నవంబర్ 10న రేవంత్ రెడ్డి చేతుల మీదుగా చెరువు ప్రారంభోత్సవం జరగనుండటంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
