హైదరాబాద్: ఉప్పల్ భగాయత్ లోని ఫైర్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీలో లంచం రూపంలో తీసుకున్నట్లుగా భావిస్తున్న 40 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం (నవంబర్ 6) సాయంత్రం ఉప్పల్ భగాయత్ లోని ఎల్బీనగర్ పరిధి ఫైర్ స్టేషన్ లో ఈ తనిఖీలు నిర్వహించారు. క్రాకర్ షాపుల నిర్వహణకు అనుమతులకోసం నిర్వాహకులనుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో ఏసీబీ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. వివరాల్లోకి వెళితే..
రంగారెడ్డ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడుల్లో ఫైర్ స్టేషన్ ఇన్ ఛార్జీ సీఐ తోపాటు ఇతర సిబ్బంది దగ్గర క్యాష్ ను స్వాధీనం చేసుకున్నారు. వారినుంచి రూ. 40 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. వారి మొబైల్ ఫోన్లలో ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లు కూడా జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ లావాదేవీలకు సంబంధించిన వివరాలు కూడా పరిశీలిస్తున్నారు.
దీపావళి పండుగ వేళ క్రాకర్స్ షాపుల అనుమతులకోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో క్రాకర్స్ షాపుల నిర్వహణలు ఇవ్వాలంటే నిర్వాహకులనుంచి పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. డబ్బులు వసూలు చేసేందుకుః అనుమతులకోసం వచ్చిన దరఖాస్తులు పెద్ద ఎత్తున పెండింగ్ ఉంచినట్లు అనుమానిస్తున్నారు. సోదాల తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు చెప్పారు.
