The Traitors Telugu Winner:'ది ట్రైటర్స్ తెలుగు' విన్నర్స్ వీళ్లే.. చివర్లో ట్విస్ట్ ఇచ్చిన శ్రావ్య, స్వీకర్.. భారీ ప్రైజ్‌మనీ సొంతం!

The Traitors Telugu Winner:'ది ట్రైటర్స్ తెలుగు' విన్నర్స్ వీళ్లే.. చివర్లో ట్విస్ట్ ఇచ్చిన శ్రావ్య, స్వీకర్.. భారీ ప్రైజ్‌మనీ సొంతం!

ఒకరిని ఒకరు నమ్మాలి.. అదే సమయంలో ఎవరు మోసం చేస్తున్నారో కనిపెట్టాలి. అనుమానం, వ్యూహాలు, కుట్రలు, మైండ్ గేమ్స్.. ఇలా ఆద్యంతం ఉత్కంఠగా సాగిన రియాలిటీ షో  'ది ట్రైటర్స్' తెలుగు తొలి సీజన్ ముగిసింది. బిగ్‌బాస్‌కు భిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ షోలో శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తీ విజేతలుగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఏకంగా రూ.42,77,000 ప్రైజ్‌మనీని సొంతం చేసుకున్నారు.

విదేశాల్లో ఇప్పటికే మంచి ఆదరణ పొందిన 'ది ట్రైటర్స్' రియాలిటీ షోను తెలుగులోనూ రూపొందించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయిన ఈ షోకు టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హోస్ట్‌గా వ్యవహరించారు. 20 మందికి పైగా సెలబ్రిటీలు, ప్రముఖులు కంటెస్టెంట్లుగా పాల్గొన్నారు. ప్రగతి, హర్షవర్ధన్, చిన్మయి తదితరులు ఈ గేమ్‌లో భాగమయ్యారు.

అసలు గేమ్ ఏంటంటే?
ఇది సాధారణ రియాలిటీ షో కాదు. ఇందులో కంటెస్టెంట్లను ఇన్నోసెంట్స్, ట్రైటర్స్‌గా విభజిస్తారు. ఇన్నోసెంట్స్ లక్ష్యం ట్రైటర్స్ ఎవరో కనిపెట్టడం. మరోవైపు ట్రైటర్స్ మాత్రం తమ అసలు గుర్తింపును దాచుకుంటూ ఒక్కొక్కరిని గేమ్ నుంచి తొలగించాలి. అనుమానాలు, చర్చలు, మైండ్ గేమ్స్ మధ్య చివరి వరకు నిలిచినవారే విజేతలుగా నిలుస్తారు.

అసలు ట్విస్ట్ ఇదే!
శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తీ తొలుత ఇన్నోసెంట్స్‌గా గేమ్‌లోకి అడుగుపెట్టారు. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో ట్రైటర్స్‌గా మారారు. ఆ తర్వాత తమ గుర్తింపును బయటపడకుండా తెలివిగా గేమ్ ఆడారు. ధనుంజయ్ వీరిద్దరిపై అనుమానం వ్యక్తం చేసినప్పటికీ మిగతా కంటెస్టెంట్లు దానిని సీరియస్‌గా తీసుకోలేదు. ఇదే చివరకు వీరికి కలిసొచ్చింది. అలా ఇద్దరూ ఫైనల్ వరకు చేరుకుని విజేతలుగా నిలిచారు.

ఎవరీ విజేతలు?
శ్రావ్య వర్మ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్. భారత బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ భార్యగా కూడా ఆమెకు గుర్తింపు ఉంది. మరో విజేత స్వీకర్ అగస్తీ గాయకుడు, సంగీత దర్శకుడిగా పేరొందారు. మొదటి మూడు ఎపిసోడ్లకే పరిమితమవుతానని భావించానని, విజేతగా నిలుస్తానని అస్సలు ఊహించలేదని శ్రావ్య ఆనందం వ్యక్తం చేసింది.

మొత్తం 10 ఎపిసోడ్లతో తొలి సీజన్ ముగియగా, ఇప్పుడు రెండో సీజన్ ఎప్పుడు వస్తుందా? అనే ఆసక్తి మొదలైంది. వచ్చే ఏడాది మరో సీజన్ వచ్చే అవకాశాలపై అభిమానుల్లో చర్చ జరుగుతోంది. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొత్తానికి బిగ్‌బాస్‌కు భిన్నమైన మైండ్ గేమ్‌తో 'ది ట్రైటర్స్' తెలుగు ప్రేక్షకులకు కొత్త తరహా వినోదాన్ని అందించింది.