హైదరాబాద్: తెలంగాణలో ఐవీఎఫ్ కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సంతానలేమితో బాధపడుతూ ఐవీఎఫ్ సేవలు పొందుతున్న దంపతులను మోసం చేసే ప్రైవేట్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఐవీఎఫ్ కేంద్రాల రిజిస్ట్రేషన్లను శాశ్వతంగా రద్దు చేసేలా చర్యలు చేపట్టాలని ఆరోగ్యశాఖ అధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.
కోఠిలోని టీజీఎంఎస్ఐడీసీ కార్యాలయంలో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన అండాల అక్రమ సేకరణ వ్యవహారానికి సంబంధించిన వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. ఈ అక్రమాలతో సంబంధం ఉన్న వ్యక్తులు, సంస్థలపై సమగ్ర విచారణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు. పోలీసుల దర్యాప్తునకు ఆరోగ్యశాఖ అధికారులు పూర్తిస్థాయిలో సహకరించాలని సూచించారు.
అక్రమ అండాల సేకరణ ముఠాతో సంబంధాలున్న ఐవీఎఫ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. అక్రమాల్లో భాగస్వాములైన వైద్యుల లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేసే అంశంపై స్టేట్, నేషనల్ మెడికల్ కౌన్సిళ్లతో సంప్రదింపులు జరపాలని అధికారులను ఆదేశించారు. తప్పు చేసినవారికి చట్టప్రకారం కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సరోగసి, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ART) చట్టాలను పటిష్ఠంగా అమలు చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ చట్టాల అమలును పర్యవేక్షించేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసి, కేంద్ర చట్టాల పరిధిలో తెలంగాణలో అదనపు నియంత్రణ చర్యలు చేపట్టే అవకాశాలను పరిశీలించాలని తెలిపారు.
ప్రైవేట్ ఐవీఎఫ్ కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, అవసరమైన సందర్భాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. ఐవీఎఫ్ చికిత్సలో ఉపయోగించే మందుల తయారీ నుంచి విక్రయాల వరకు నిఘా ఉంచాలని డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులకు స్పష్టం చేశారు. చికిత్స పేరుతో దంపతులను మోసం చేసే కేంద్రాలపై ఎలాంటి ఉపేక్ష ఉండకూడదన్నారు.
ఐవీఎఫ్ సేవల్లో పారదర్శకత, చట్టబద్ధత ఉండేలా పటిష్ఠ పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ రంగంలో ఐవీఎఫ్ సేవలను మరింత విస్తరించే చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.గతంలో సృష్టి ఫర్టిలిటీ సెంటర్లో జరిగిన అక్రమాలను ప్రభుత్వం అరికట్టిందని, తాజాగా అండాల అక్రమ సేకరణ ముఠాను అధికారులు గుర్తించి పట్టుకున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఐవీఎఫ్ కేంద్రాల ముసుగులో దోపిడీకి పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు.
