వచ్చే ఏడాది ఉద్యోగం మారాల్సిందే: 68 శాతం మంది ఫీలింగ్ ఇదే..!

వచ్చే ఏడాది ఉద్యోగం మారాల్సిందే: 68 శాతం మంది ఫీలింగ్ ఇదే..!

న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) దెబ్బతో 2026లో టెక్ రంగం షేక్ అయ్యింది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి వరల్డ్ టెక్ దిగ్గజాలు ఏఐ మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెడుతూ వ్యయాల తగ్గింపులో భాగంగా లేఆఫ్స్‌ ప్రకటించాయి. వేలాది మంది ఉద్యోగులను ఉన్నఫళంగా ఇంటికి పంపించేశాయి. ఉద్యోగుల్లో తమ జాబ్ ఉంటుందో.. ఊడుతుందో తెలియని ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఉద్యోగులు కొత్త జాబ్ దేవుడెరుగు.. ముందు ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకుంటే చాలు అనే మైండ్ సెట్‎లో ఉన్నారు. 

ఏఐ ప్రభావంతో మెజార్టీ ఎంప్లాయ్స్ ఉన్న జాబ్ రిజైన్ చేసి కొత్త ఉద్యోగం కోసం ట్రై చేయడం ఆపేశారు. ఈ క్రమంలో foundit నిర్వహించిన కెరీర్ రీసెట్ సర్వే 2027లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మార్కెట్లో అనిశ్చితి ఉన్నప్పటికీ 68.4 శాతం మంది భారతీయులు 2027లో కొత్త ఉద్యోగం కోసం వెతకాలని యోచిస్తున్నట్లు తేలింది. దేశవ్యాప్తంగా 9,951 మంది ఉద్యోగుల అభిప్రాయాల ఆధారంగా ఈ సర్వే నివేదికను రూపొందించారు.

 40.3 శాత మంది కెరీర్ వృద్ధి, 29.7 శాతం మంది అధిక జీతం, 20.3 శాతం మంది వర్క్-లైఫ్ బ్యాలెన్స్ వంటి కారణాలతో ఉద్యోగాలు మారాలని చూస్తోన్నట్లు సర్వేలో వెల్లడైంది. ఏఐ వల్ల తమ రంగంలో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయని లేదా ఉద్యోగాల కోత పడుతుందని కేవలం 5.7 శాతం మంది మాత్రమే ఆందోళన చెందుతున్నారు. మరో 12.2 శాతం మంది ఏఐ వల్ల తమ ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు వస్తాయే తప్ప.. తమ ఉద్యోగాలను అది పూర్తిగా భర్తీ చేయలేదని విశ్వసిస్తున్నారు.

 సర్వేలో పాల్గొన్న వారిలో 82.1 శాతం మంది ఏఐని తమ కెరీర్ వృద్ధికి ఒక గొప్ప అవకాశంగా చూస్తున్నారు. ఏఐ సృష్టిస్తున్న మార్పులకు అనుగుణంగా మారడానికి 67 శాతం మంది ఇప్పటికే చురుగ్గా కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటున్నట్లు తేలింది. ఈ సర్వే నివేదికను పరిశీలిస్తే.. ఏఐ వల్ల ఉద్యోగులు ఎక్కువగా బయటపడటం లేదు అనే విషయం మాత్రం స్పష్టం అవుతోంది.