హైదరాబాద్: ఫాక్స్ సాగర్ చెరువు డైవర్షన్ నాలాను కబ్జా చేసేందుకు జరిగిన ప్రయత్నాన్ని హైడ్రా అధికారులు అడ్డుకున్నారు. నాలాలో మట్టి, నిర్మాణ వ్యర్థాలను డంపింగ్ చేసి పూడ్చివేసేందుకు ప్రయత్నించడంపై చర్యలు చేపట్టారు. సుభాష్ నగర్‌లోని ఫాక్స్ సాగర్ తూము వద్ద ఈ అక్రమ డంపింగ్ జరిగినట్లు గుర్తించిన అధికారులు వెంటనే రంగంలోకి దిగారు.
జేసీబీ, టిప్పర్, ట్రాక్టర్ వాహనాలను ఉపయోగించి నాలాలో మట్టి పోస్తుండగా హైడ్రా అధికారులు అడ్డుకున్నారు. అక్రమ డంపింగ్‌కు ఉపయోగించిన జేసీబీ, టిప్పర్, ట్రాక్టర్‌ను సీజ్ చేశారు. టిప్పర్ , ట్రాక్టర్ నంబర్ తో పాటు వాహనాల యజమానులను పెట్ బషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఫాక్స్ సాగర్ డైవర్షన్ నాలాలో అక్రమంగా వేసిన మట్టిని హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో వేసిన మట్టికట్టను కూడా తొలగించే చర్యలు చేపట్టారు. చెరువు పరిధిలో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలకు తావులేకుండా అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు.
సిమెంట్ రోడ్డు తొలగింపు
ఫాక్స్ సాగర్ చెరువు పరిధిలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఫామ్‌హౌస్‌కు వెళ్లేందుకు నిర్మించిన సిమెంట్ రోడ్డును కూడా హైడ్రా అధికారులు తొలగించారు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో చేపట్టిన నిర్మాణాలను తొలగిస్తూ చెరువు పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నారు. ఫాక్స్ సాగర్ చెరువు సహజ నీటి ప్రవాహ మార్గాలు దెబ్బతినకుండా, నాలాలు ఆక్రమణలకు గురికాకుండా హైడ్రా పర్యవేక్షణ కొనసాగిస్తోంది. చెరువు పరిరక్షణలో భాగంగా అక్రమ డంపింగ్, కబ్జాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
